దీపిక శూర్పణఖ: ముక్కు కోసేస్తారట

బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పడుకొనే కాస్తా శూర్పణఖ అయిపోయింది. రావణుడి సోదరి శూర్పణఖ అనీ, ఆమె రాక్షసి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా. రామాయణంలో లక్ష్మణుడు, శూర్పుణఖ ముక్కు కోసేస్తాడు. అలా, తామూ దీపికా పడుకొనేని సత్కరిస్తామంటున్నారు రాజ్‌పుత్‌ కర్ణిసేన చీఫ్‌ లోకేంద్ర సింగ్‌ కల్వి. రాణి పద్మిని పట్ల రాజ్‌పుత్‌ వంశంలో ప్రతి ఒక్కరికీ అపారమైన గౌరవం వుందనీ, చరిత్రలో ఆమెది ఎంతో గౌరవ ప్రదమైన స్థానమనీ.. అలాంటి పద్మిని పాత్రని ‘పద్మావతి’లో కించపరిస్తే చూస్తూ ఊరుకునేది లేదని లోకేంద్ర సింగ్‌ తెగేసి చెబుతున్నారు.

డిసెంబర్‌ 1న ‘పద్మావతి’ సినిమా విడుదల కానుండగా, ఇప్పటికే ఈ సినిమాపై బోల్డంత దుమారం చెలరేగుతోంది. తాజాగా, ఈ వివాదంపై కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ స్పందించారు. ‘ఏ సినిమా అయినా, చరిత్రను వక్రీకరించకూడదు.. సినిమా తీసే హక్కు ఎలాగైతే దర్శక నిర్మాతలకు వుంటుందో.. చరిత్రను వక్రీకరించారన్న అనుమానం వస్తే, దాన్ని అడ్డుకునే హక్కు ఇతరులకూ వుంటుంది..’ అని అన్నారాయన.

ఇదిలా వుంటే, రాజ్‌పుత్‌ కర్ణిసేన హెచ్చరికల నేపథ్యంలో ‘పద్మావతి’ చిత్ర దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీకి, సాయుధ భద్రత కల్పించాలంటూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో, ‘పద్మావతి’ వివాదంలో జోక్యం చేసుకోవాలంటూ ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. స్థానిక ఎన్నికలు ఉత్తరప్రదేశ్‌లో డిసెంబర్‌ 1న జరగనున్నాయనీ, అదే రోజు ‘పద్మావతి’ సినిమా విడుదల కానుండడంతో భద్రతా పరమైన సమస్యలొస్తాయని యూపీ ప్రభుత్వం కేంద్రానికి విన్నవించడం గమనార్హం.

మొత్తమ్మీద, దీపికని శూర్పణఖతో పోల్చడం, దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీని చంపేస్తామనే హెచ్చరికలు, థియేటర్లను ధ్వంసం చేస్తామంటూ అల్టిమేటం.. వెరసి ‘పద్మావతి’ సినిమా వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఇంత గందరగోళం మద్య ‘పద్మావతి’ ఏమవుతుందో వేచి చూడాల్సిందే.