నాకు రెజీనాతో పెళ్లయిపోయింది

“నాకు రెజీనాతో పెళ్లయిపోయింది. మాకు ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు. పెద్దపాప ఆరో తరగతి, చిన్నపాప రెండో తరగతి. రెజీనా తర్వాత రాశిఖన్నా, రకుల్ తో కూడా నాకు ఎఫైర్స్ ఉన్నాయి.” స్వయంగా సాయిధరమ్ తేజ్ చెప్పిన మాట ఇది. వరుసగా రెజీనాతో ఎఫైర్ల గురించి అడుగుతుంటే చిరాకేసి తనపై తానే ఇలా సెటైర్ వేసుకున్నాడు తేజ్.

జవాన్ ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ సరదా సన్నివేశం చోటుచేసుకుంది. రెజీనాతో తనకు ఎలాంటి ఎఫైర్ లేదని చెప్పిచెప్పి బోర్ కొట్టేసిందంటున్నాడు సాయిధరమ్ తేజ్. ఇకనైనా పుకార్లు ఆపాలని ప్రాధేయపడుతున్నాడు.

“నాకు ఇంకోసారి రెజీనాతో చేయాలని ఉంది. కానీ ఎందుకొచ్చిన గొడవ అని ఆమెను పక్కన పెట్టేస్తున్నాను. ఈ గాసిప్స్ వల్ల వేరే అమ్మాయిని అప్రోచ్ అవ్వడానికి కూడా నాకు చాలా కష్టమైపోతోంది. గాసిప్స్ గురించి వాళ్లు అడుగుతున్నారు. ఇలాంటి గాసిప్స్ ను నేను ఆపలేను. నేను మాత్రమే కాదు, ఇండస్ట్రీలో నాలాంటి హీరోలు ఎవరూ ఇలాంటి గాసిప్స్ ఆపలేరు.” సాయిధరమ్ తేజ్ రియాక్షన్ ఇది.

గాసిప్స్ వినడానికి బాగుంటాయని, కానీ అవి ఎప్పుడు, ఎక్కడ ఇబ్బంది పెడతాయో ఊహించడం చాలా కష్టమంటున్నాడు తేజ్. కచ్చితంగా వ్యక్తిగత జీవితంపై గాసిప్స్ ప్రభావం చూపెడతాయని మాత్రం అంటున్నాడు.