‘సినిమాలకు ఎప్పుడు గుడ్ బై చెప్పేస్తారు.?’ అన్న ప్రశ్న వస్తే చాలు విద్యాబాలన్‌కి ఎక్కడలేని కోపం వచ్చేస్తుంటుందట. హీరోయిన్గా రిటైర్మెంట్ తీసుకున్నట్లేనా.? అని పెళ్ళవగానే హీరోయిన్లను ప్రశ్నించే రోజులెప్పుడో పోయాయని అంటోందామె. ట్రెండ్ మారిందనీ, హీరోయిన్లు పెళ్ళయ్యాక కూడా తెరపై హీరోయిన్లుగానే కన్పిస్తున్నారని చెబుతోన్న విద్యాబాలన్, హీరోలకు 60 ఏళ్ళు వచ్చినా ఆ ప్రశ్న రాకపోవడం, హీరోయిన్లను పెళ్ళయిన వెంటనే సినిమాలు మానేస్తారా? అని ప్రశ్నించడం మొదట్లో తనకు చాలా ఇబ్బందిగా అన్పించేదని విద్యాబాలన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
‘తుమ్హారీ సులు’ సినిమాతో ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానున్న విద్యాబాలన్, సినిమాలో తన పాత్రకు తగ్గట్టుగానే తనను తాను మలచుకుంటానని అంటోంది. ‘సినిమాలో హాట్‌గా కన్పించడం, డీ గ్లామరస్‌గా కన్పించడం అనేవి దర్శకుడి ఆలోచనల్ని బట్టి వుంటాయి. ఆ సినిమాలో చెయ్యాలా.? వద్దా.? అనేది నిర్ణయించుకోవాల్సింది నేనే. నన్ను ఆ కథ ఇంప్రెస్ చేసిన విధానాన్ని బట్టి, గ్లామర్ ఆలోచన వుంటుంది..’ అని విద్యాబాలన్ పేర్కొంది.
‘డర్టీపిక్చర్’కి ముందూ, ఆ తర్వాతా చాలా సినిమాలు చేసినా, అదే తనకు బెంచ్ మార్క్ అయిపోయిందనీ, అలాంటి బెంచ్ మార్క్ కోసం ప్రయత్నిస్తూనే వుంటాననీ చెబుతోన్న విద్యాబాలన్, ‘తుమ్హారి సులు’ అలాంటి హిట్ తనకు ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటోంది. ‘ఇప్పటికైతే నటనకు గుడ్ బై చెప్పేంత వయసయిపోలేదు.. నటించాలనే ఇంట్రెస్ట్ వున్నంతకాలం నా వయసు నాకు అడ్డంకి కానే కాదు..’ అని విద్యాబాలన్ క్లారిటీ ఇచ్చేసింది.