నిపుణుల మాట : సుప్రీంకు వెళ్లినా నో యూజ్!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి వినతిని సీబీఐ కోర్టు తోసిపుచ్చడం ఆయన అనుచరులు పెట్టుకున్న ఆశలకు పెను భంగపాటు. ఎలాంటి తీర్పు వచ్చినా, అది తన పాదయాత్ర మీద ప్రభావం చూపించకూడదనే ఉద్దేశంతోనే జగన్ వ్యక్తిగతంగా తొలినుంచి సిద్ధపడి ఉన్నారు. సోమవారం ఉదయం లోటస్ పాండ్ లో సీనియర్లతో నిర్వహించిన భేటీలో కూడా.. ఆయన ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. వారు భయపడుతున్నట్లే ప్రతికూల తీర్పు వచ్చింది.

అయితే జగన్ తరఫు న్యాయవాదులు మాత్రం.. సీబీఐ కోర్టు తీర్పుపై సుప్రీం కోర్టును ఆశ్రయిస్తాం అని అంటున్నారు. అయితే న్యాయనిపుణులు చెబుతున్న దాన్ని బట్టి జగన్ ఈ విషయంలో సుప్రీం కోర్టును ఆశ్రయించినా సరే ఎలాంటి ప్రయోజనం ఉండదని, మరోసారి భంగపాటు తప్ప ఏం సాధించలేరని తెలుస్తోంది.

సీబీఐ కోర్టులో సాగుతున్న విచారణల నుంచి తనను పూర్తిగా తప్పించాల్సిందిగా జగన్ తొలుత రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. అయితే అక్కడ ఆయనకు ఎదురుదెబ్బే తగిలింది. పైగా హైకోర్టు అక్షింతలు వేసింది. పాదయాత్ర అనేది రాజకీయ వ్యూహంలా ఉన్నదని తప్పు పట్టింది. మొత్తానికి ఈ విషయాన్ని కింది కోర్టు (సీబీఐ కోర్టు)లోనే తేల్చుకోవాలని, తమ వద్దకు రావద్దని తేల్చింది.

సీబీఐ కోర్టును ఆశ్రయించేప్పుడు జగన్ న్యాయవాదులు ఓ టెక్నిక్ ప్రయోగించారు. హైకోర్టు అనుమతి తిరస్కరించింది గనుక.. అవే సెక్షన్ల కింద ఇక్కడ పిటిషన్ వేసినా ప్రయోజనం ఉండదనే ఉద్దేశంతో సెక్షన్లు మార్చి వేశారు. అయినా సరే.. సీబీఐ కోర్టు కూడా పిటిషన్ ను తోసిపుచ్చింది. ఏదో ఈ సందర్భంలో చెప్పుకోడానికి తాము సుప్రీం కోర్టును ఆశ్రయిస్తాం అనే డైలాగు రక్తి కట్టిస్తుంది గానీ.. టెక్నికల్ గా అక్కడ కూడా జగన్ విజ్ఞప్తిని పట్టించుకునే అవకాశం లేదు. ఇది కోర్టులో తేలాల్సిన వ్యవహారమే అని వారు కూడా అనే ఛాన్సే ఎక్కువగా ఉందని న్యాయనిపుణులు చెబుతున్నారు.

జగన్మోహన్ రెడ్డి పదేపదే ‘నో’ చెప్పించుకోవడానికి తప్ప ఈ విషయంలో మినహాయింపుల కోసం మరోసారి న్యాయస్థానానికి వెళ్లడం అనవసరం అని నిపుణులు అంటున్నారు. దానికి బదులుగా తన ప్రత్యామ్నాయ మార్గాలను తాను చూసుకున్నట్లయితే కనీసం ఆయనకు సమయం ఆదా అవుతుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి వ్యూహకర్తలు న్యాయపరమైన చిక్కులను కూడా అంచనా వేసి.. ఆమేరకు నడుచుకుంటారో.. లేదా, ఈ ఎపిసోడ్ ను ఇంకాస్త సాగతీయడానికి సుప్రీం గడప తొక్కుతారో వేచిచూడాలి.