విశాల్‌ కార్నర్‌ అయ్యింది ఇందుకే.!

తమిళ హీరో విశాల్‌ ‘కార్నర్‌’ అయ్యాడు. జీఎస్‌టీ ఇంటెలిజెన్స్‌ అధికారులు, విశాల్‌కి చెందిన నిర్మాణ సంస్థ విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీలో సోదాలు నిర్వహించారు. జీఎస్‌టీకి సంబంధించి ఎగవేతలు, అక్రమాలు ఏమైనా వున్నాయా.? అని తనిఖీలు చేశారు. తనిఖీల్లో ఏం తేలింది.? అన్నది వేరే విషయం. ఈ తనిఖీలతో విశాల్‌ని భయపెట్టే ప్రయత్నమైతే జరుగుతోందన్నది నిర్వివాదాంశం.

ఎందుకిలా.? విశాల్‌ ఎందుకు కార్నర్‌ అయ్యాడు.? ఈ ప్రశ్నలకి ఒకటే సమాధానం.! విశాల్‌, ‘మెర్సల్‌’ సినిమాకి మద్దతివ్వడమే. కేవలం సినీ నటుడు మాత్రమే కాదు, నిర్మాత, పైగా తమిళ సినీ పరిశ్రమలో అత్యంత కీలకమైన వ్యక్తి కూడా. ఆ హోదాలోనే, ‘మెర్సల్‌’ సినిమాని అభినందించాడు. ఆ సినిమాపై తలెత్తిన రాజకీయ దుమారంపైనా ప్రశ్నించాడు. బీజేపీ నేత రాజా, ‘మెర్సల్‌’ సినిమా పైరసీ వీడియో చూడ్డాన్నీ తప్పు పట్టాడు.

హాలీవుడ్‌లో కొన్ని సినిమాలు అమెరికా అధ్యక్షుడినీ ప్రశ్నించేలా వుంటాయనీ, దేశం ఎదుర్కొంటోన్న ఓ సమస్యపై ‘మెర్సల్‌’ సినిమాలో ప్రస్తావిస్తే, దానిపై రాజకీయ దాడులు జరుగుతాయా.? అని విశాల్‌ మండిపడ్డాడు. ఇది న్యాయం కాదన్నాడు. భావ ప్రకటనా స్వేచ్ఛకు విఘాతం కల్గిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.

వీటన్నిటి ఫలితమే విశాల్‌పై జీఎస్‌టీ ఇంటెలిజెన్స్‌ దాడులు అని అనుకోవచ్చు. మరి, ఇదే కోవలో కమల్‌హాసన్‌పైనా జీఎస్‌టీ ఇంటెలిజెన్స్‌ దాడులకు దిగుతుందా.? ‘మెర్సల్‌’ సినిమాకి బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్‌ అన్న తేడాల్లేకుండా అన్ని సినీ పరిశ్రమల నుంచీ మద్దతు వస్తున్న దరిమిలా, ఆయా సినీ పరిశ్రమల్లోనూ ఈ తరహా దాడులు జరుగుతాయా.?

ఒక్కటి మాత్రం నిజం.. కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్‌ తమని ఎవరు ప్రశ్నించినా తట్టుకోలేకపోతోంది. ‘ప్రశ్నించారు’ అన్న అనుమానం కలిగినా వదిలిపెట్టడంలేదు. దానికి పెర్‌ఫెక్ట్‌ ఎగ్జాంపుల్‌ విశాల్‌పై జీఎస్‌టీ ఇంటెలిజెన్స్‌ దాడులన్నది తమిళ సినీ పరిశ్రమ వాదన. ఈ వివాదం ఎక్కడిదాకా వెళుతుందో వేచి చూడాల్సిందే.

కొసమెరుపు: వివాదానికి కేంద్రబిందువు అయిన ’మెర్సల్‘ సినిమా విషయంలో నిర్మాత వెనక్కి తగ్గారు. అభ్యంతరకర సన్నివేశాలు తొలగిస్తామన్నారు. కానీ, ఆ సినిమాకి మద్దతు పలికినవారే వివాదాలెదుర్కొంటున్నారు. కామెడీ అంటే ఇదే మరి.