నేను అస్సలు బాధపడట్లేదు

రాజా ది గ్రేట్ సినిమా మొదట రామ్ వద్దకే వచ్చింది. కానీ ఆ స్క్రిప్ట్ ను తిరస్కరించాడు రామ్. తర్వాత ఆ కథను రవితేజ ఓకే చేయడం, సినిమా థియేటర్లలోకి రావడం చకచకా జరిగిపోయాయి. ప్రస్తుతం థియేటర్లలో నడుస్తున్న ఈ సినిమా చూసి రామ్ ఎలా ఫీలవుతున్నాడు. ఓ మంచి సినిమా మిస్ అయ్యానని బాధపడుతున్నాడా..? ఇదే విషయంపై ప్రశ్నించింది మీడియా. అలాంటి బాధలేం లేవంటున్నాడు రామ్.

“అనిల్ రావిపూడి చెప్పిన కథను నేను రిజెక్ట్ చేయలేదు. ఆ సినిమా జరగలేదంతే. ఒకసారి రిజెక్ట్ చేసిన తర్వాత ఆ ప్రాజెక్టు గురించి మళ్లీ ఆలోచించను. చాలాసార్లు ఆలోచించిన తర్వాతే రిజెక్ట్ చేస్తాను. వద్దనుకున్న తర్వాత మళ్లీ ఆలోచించి ఉపయోగం ఉండదు. ఆ సినిమా మిస్ అయినందుకు పెద్దగా బాధపడట్లేదు.” రామ్ వెర్షన్ ఇది.

ఓ కథ విన్నప్పుడు మనసుకు హత్తుకోవాలని అంటున్న రామ్, అలా ఎగ్జయిట్ అయ్యాను కాబట్టే అనిల్ రావిపూడితో సినిమా చేస్తున్నట్టు గతంలో స్వయంగా ప్రకటించానని, కానీ అనుకోని కారణాల వల్ల సినిమా జరగలేదని అంటున్నాడు. ఆ కారణాలేంటని గుచ్చిగుచ్చి అడిగితే, ‘ఉన్నది ఒకటే జిందగీ’ చాలా బాగుంటుంది, తప్పకుండా చూడండంటూ అక్కడ్నుంచి వెళ్లిపోయాడు.