‘పచ్చ’ కండువా కప్పుకుంటున్నది ఈమేనా.?

అధికార తెలుగుదేశం పార్టీలోకి మరో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జంప్‌.. అన్న వార్తతో పెద్దగా ఎవరూ షాక్‌కి గురవలేదు. కానీ, ఆ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్న వార్తతో మాత్రం చాలామంది షాక్‌ అయ్యారు. నిజమే మరి, ఒకప్పుడు ‘చంద్రబాబు తల తెగనరుకుతాం..’ అన్నది ఈవిడగారే. అఫ్‌కోర్స్‌, రాజకీయాల్లో ఇలాంటివి సర్వసాధారణమేననుకోండి.. అది వేరే విషయం.

తెలంగాణ రాష్ట్రం వచ్చాక, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ని తెలంగాణలో లేకుండా చేస్తామని టీఆర్‌ఎస్‌ నినదించింది. కానీ, అదే టీఆర్‌ఎస్‌, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో టీడీపీకి గుడ్‌ బై చెప్పించి, ఏకంగా మంత్రి పదవి కూడా ఇచ్చింది. అప్పటిదాకా ఆయన పక్కా సమైక్యవాది.. తెలంగాణ ద్రోహి.. ఇప్పుడు మాత్రం, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి అత్యంత సన్నిహితుడు. రాజకీయాలు ఇలాగే వుంటాయ్‌ మరి.!

ఆంధ్రప్రదేశ్‌లో ఈ వింతలు మరీ ఎక్కువగా కన్పిస్తున్నాయి. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు ప్రభుత్వాన్ని బూతులు తిట్టారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు జ్యోతుల నెహ్రూ. అప్పట్లో ఆయన వైఎస్సార్సీపీకి సంబంధించి అసెంబ్లీలో ఉప నేత. కానీ, ఆయనా పార్టీ ఫిరాయించేశారు. చంద్రబాబు కన్నా ఘనుడు ప్రపంచాన కన్పించడంటూ జ్యోతుల ఆ తర్వాతత నినదించారు.

ఎవరు పార్టీ ఫిరాయించినాసరే, తాను మాత్రం జగన్‌ వెంటే వుంటానని నిన్న మొన్నటిదాకా చెబుతూ వచ్చారు గిడ్డి ఈశ్వరి. పార్టీ ఫిరాయించిన చాలామందిపై చాలా రకాల విమర్శలు చేశారామె. చివరికి ఆమె కూడా వైఎస్సార్సీపీకి గుడ్‌ బై చెప్పేయడం గమనార్హం. ఇంకేముంది.? వైఎస్సార్సీపీ ‘రేటు’ కట్టేసిందామెకి. ఏకంగా, 25 కోట్ల రూపాయల ప్యాకేజీ కోసం గిడ్డి ఈశ్వరి టీడీపీలోకి జంప్‌ చేసేస్తున్నారట.

ఈ ప్యాకేజీల గోలేంటోగానీ, ఎంత బుజ్జగించినా.. పార్టీ ఫిరాయింపుల్ని వైఎస్సార్సీపీ ఆపలేకపోతోంది. రాజకీయాల్లో విలువలు అంతలా తగలడ్డాయ్‌ మరి.! 2019 ఎన్నికల తర్వాత ఏమవుతుంది.? అన్న విషయాన్ని పక్కన పెడితే, జగన్‌ పాదయాత్ర ప్రారంభించాక ఇప్పటిదాకా ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు, వైఎస్సార్సీపీని వీడిన దరిమిలా.. ముందు ముందు ఈ లిస్ట్‌ ఇంకా పెరిగే అవకాశమైతే సుస్పష్టం.