పచ్చ ప్రచారానికి పరువు పోతుందనే భయం లేదా?

కొన్ని రోజులుగా తెలుగుదేశం నాయకులు ఏ స్థాయి వారు మీడియాతో మాట్లాడినా ఒకటే ప్రచారాంశాన్ని నెత్తికెత్తుకుంటున్నారు. రోజు వారీ వార్తలను గమనిస్తున్న ఎవ్వరికైనా సరే.. ఈ సంగతి అర్థమవుతుంది. అటు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నుంచి.. గల్లీ స్థాయి లీడర్ల వరకు అంతా ఒకటే పాట పాడుతున్నారు. ‘‘ఉపాధి హామీ పనుల్లో మెషినరీతో పనులు చేయిస్తున్నారంటూ వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కేంద్రానికి ఫిర్యాదు చేశారు.

వైసీపీ ఎంపీ కేంద్రానికి లేఖ రాయడం వల్ల అక్కడినుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఆగిపోయాయి. చంద్రబాబునాయుడు చొరవ తీసుకుని కేంద్రంతో మాట్లాడి నిధులు విడుదల అయ్యేలా చూశారు…’’ ఈ విషయం తెలుగుదేశం వర్గాల ద్వారా ముమ్మరంగా ప్రచారం అవుతోంది.

అయితే ఈ విషయాన్ని తాము ఎంతగా ప్రచారం చేస్తే.. అంతగా తమకే పరువు చేటు అనే సంగతిని తెలుగుదేశం పార్టీ ఎందుకు గుర్తించలేకపోతున్నదో అర్థం కావడం లేదు. ప్రజలు ఏ కొంచెం లోతుగా ఆలోచించినా సరే.. తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న వంచనను పసిగడతారు. వైవీ సుబ్బారెడ్డి నిధులు ఆపాలని కేంద్రాన్ని కోరలేదు.. రాష్ట్రంలో కూలీల కడుపు కొడుతూ కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్న అరాచకాల్ని మాత్రమే కేంద్రానికి తెలియజెప్పారు. దానివల్ల నిధులు ఆగినా సరే.. తర్వాతైనా తిరిగి విడుదల అయ్యాయి. ఆ రకంగా వైవీ లేఖ వల్ల కూలీలకు జరిగిన నష్టం లేదు.

కానీ చంద్రబాబునాయుడు ప్రభుత్వం కూలీలకు చేస్తున్న ద్రోహం మాటేమిటి? నిధులు ఆగిపోయాయనే మాట చెబుతున్నారు తప్ప.. కూలీలకు పొట్టకూటికోసంపనుల రూపేణా చెల్లించాల్సిన డబ్బును- పొక్లయిన్లతో పనులు చేస్తున్న పార్టీ కేడర్ కు దోచిపనెడుతున్న సంగతి నిజం కాదా? అనే విషయంలో ఎవ్వరూ మాట్లాడడం లేదు.

తెలుగుదేశం నాయకులు కూడా తాము మెషినరీతో పనులు చేయించడం లేదని, ఉపాధి హామీ పద్దు కింద సాంతం కూలీల్తోమాత్రమే పనులు చేయిస్తున్నాం అని.. మాటమాత్రంగా కూడా చెప్పడం లేదు. కానీ ప్రజలు గనుక ఈ విషయాన్ని లోతుగా ఆలోచిస్తే వారికే అర్థమవుతుంది. వైవీ సుబ్బారెడ్డి కేంద్రానికి లేఖ రాసింది నిజమే కావొచ్చు.. అసలైన కూలీలకు , కూటికి గతిలేని వారికి న్యాయం జరగడం కోసం మాత్రమే ఆయన లేఖ రాశారు.

రాష్ట్రప్రభుత్వం మొరపెట్టుకున్నా స్పందించదు గనుక.. అసలు నిధులు ఎక్కడినుంచి వస్తున్నాయో వారికే ఇక్కడ చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని తెలియజెప్పారు. కూలీలు ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోరులే అనే తెంపరితనం తెలుగుదేశం నాయకుల మాటల్లో కనిపిస్తోంది. తాము ఉపాధి హామీ కింద సిమెంటు రోడ్లు వేశాం.. వైవీ సుబ్బారెడ్డి గారికి రోడ్లు వేయడం ఇష్టం లేదా వంటి మాటలు చెబుతున్నారు తప్ప.. ఆ నిదులతో తాము కూలీల కడుపు నింపుతున్నామా.. పార్టీ నాయకుల ఖజానాలు నింపుతున్నామా అనే క్లారిటీ ఇవ్వడం లేదు. వైవీ సుబ్బారెడ్డి లేఖ గురించి, ఆయనేదో కూలీలకు ద్రోహం చేసేసినట్లుగా తెదేపా ఎంతగా ప్రచారం చేస్తే వారికే అంత పరువు నష్టం అనే సంగతిని వారు తెలుసుకోవాలి.