‘పసుపుపచ్చ’ రమణ పగటి కలలు…!

కొన్ని పార్టీల నాయకులకు చేతినిండా పనివుండదు. ఏ పార్టీకైనా పనివుండని పరిస్థితి ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది. ఆ సమయంలో వారు డిప్రెషన్లో పడిపోతారు. ఈగలు కొట్టుకుంటున్నట్లు జనం భావిస్తారనే ఫీలింగ్‌తో బాధపడిపోతుంటారు. తమ పార్టీ పని ముగిసిపోయిందని చెప్పుకోవడం నామోషీగా భావించడంతో లేనిపోని గొప్పలు చెప్పుకుంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంటారు. ప్రస్తుతం తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ ఇదే పని చేస్తున్నారు.

రేవంత్‌ రెడ్డి ఉన్నంత కాలం పెద్దగా మాట్లాడని ఈయన ఫైర్‌బ్రాండ్‌ నాయకుడు బయటకు వెళ్లిపోగానే ఏదేదో మాట్లాడుతున్నారు. మాట్లాడటం తప్పు కాదు. పార్టీ అధ్యక్షుడు మాట్లాడకపోతే తప్పవుతుంది. కాని మాటలు అర్థవంతంగా ఉండాలి కదా. పార్టీ బలోపేతానికి, పునరుజ్జీవనానికి తీసుకుంటున్న చర్యల గురించి చెప్పాలి. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటాల గురించి వివరించాలి.

అదేం లేకుండా వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని, వస్తే ఫలానా సామాజికవర్గాలకు మంత్రి పదవులు ఇస్తామని చెప్పుకోవడం అవసరమా? ఆ పరిస్థితి, అందుకు అవకాశాలున్నాయా? ఈ ‘పసుపు పచ్చ పార్టీ’ నాయకుడు ఎందుకిలా పగటి కలలు కంటున్నారు? కలలు కనే హక్కు ఉంది. కాని ఆ కలలను చూసి తాను ఆనందించవచ్చు కదా.

బహిరంగంగా చెప్పి నవ్వులపాలు కావడమెందుకు? రమణ ఓ సభలో మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రితోపాటు తొమ్మిది మంత్రి పదవులూ బీసీలకే ఇస్తామన్నారు. ఇద్దరు ఎస్సీలకు, ఒక మైనారిటీకి మంత్రివర్గంలో చోటు కల్పిస్తామన్నారు. ముగ్గురు మహిళలకూ అవకాశం ఇస్తారట. నిబంధనల ప్రకారం పదిహేడుమందికే మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి యాభై నుంచి అరవైమంది ఎమ్మెల్యేలుగా గెలవాలన్నారు.

‘ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం’ అనే సామెత రమణకు సరిగ్గా సరిపోతుంది. తెలంగాణలో టీడీపీ ఎప్పటికీ అణిగిపోయి ఉంటుందని నిర్ధారించలేం. భవిష్యత్తులో ఎప్పుడైనా పుంజుకొని అధికారంలోకి వచ్చే అవకాశం ఉండొచ్చు. అటువంటి పరిస్థితి ఉండి పార్టీ బంపర్‌ మెజారిటీతో గెలిచాక మంత్రివర్గం ప్లానింగ్‌పై మాట్లాడవచ్చు.

అప్పుడు కూడా అధినేత చంద్రబాబు నిర్ణయం ప్రకారం జరుగుతుందేతప్ప రమణో, మరొకరో నిర్ణయించరు. బీసీ ముఖ్యమంత్రి అవుతాడని రమణ చెబుతున్నారంటే ఆయన ఆశలు పెట్టుకున్నారేమో…! రాష్ట్రంలో పొత్తుల విషయం ఎన్నికల సమయంలో చర్చిద్దామని చంద్రబాబు స్పష్టంగా చెప్పినప్పటికీ రమణ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నారు. టీడీపీ భావజాలానికి దగ్గరగా ఉండే పార్టీతో పొత్తు పెట్టుకుంటామన్నారు.

‘మొత్తం 119 స్థానాలకూ అభ్యర్థులను నిలబెడతాం’ అని ఒకసారి, ఒంటరిగా పోటీ చేస్తామని మరోసారి అన్నారు. పొత్తుల విషయంలో అంతిమ నిర్ణయం చంద్రబాబుదే. పొత్తు పెట్టుకున్నా, ఒంటరిగా పోటీ చేసినా అధికారం సంపాదించేటన్ని స్థానాలు రావు. అలాంటప్పుడు మంత్రి పదవుల గురించి మాట్లాడితే ప్రహసనంగా మారుతుందే తప్ప ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. టీడీపీ నుంచి నాయకులు ఇంకా బయటకు వెళుతూనే ఉన్నారు. కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు.

వీరిని ఆపే ప్రయత్నాలు రమణ ఎంతవరకు చేస్తున్నారో తెలియదు. టీడీపీ పనైపోయిందని ఉమా మాధవరెడ్డి బహిరంగంగానే చెప్పారు. ఆమె పొలిట్‌బ్యూరో సభ్యురాలు కూడా. టీఆర్‌ఎస్‌లోకిగాని, కాంగ్రెసులోకిగాని వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్న ఈమె టిక్కెట్‌ హామీ కోసం చూస్తున్నారు. టిక్కెట్‌ గ్యారంటీగా ఇచ్చే పార్టీలో చేరతారు. రేవంత్‌ వెళ్లిపోయినప్పుడే ఈమె పేరూ బయటకొచ్చింది. టీడీపీ టెక్కెట్‌ ఇస్తుండొచ్చుగాని గెలుపుపై నమ్మకం లేనట్లుగా ఉంది.