ప్రశ్నిస్తా.. అది నా హక్కు: ప్రకాష్‌రాజ్‌

‘ప్రభుత్వాన్నే ప్రశ్నిస్తా.. ప్రజాస్వామ్యం నాకు కల్పించిన హక్కు అది. నేను ఓటర్‌ని, నేను దేశంలో ఓ పౌరుడిని. పౌరుడు, ప్రభుత్వాన్ని కాక, ఇంకెవర్ని ప్రశ్నిస్తాడు.?’

– ఇదీ సినీ నటుడు ప్రకాష్‌రాజ్‌ అంతరంగం.

‘హూమ్‌ సో ఎవర్‌ ఇట్‌ మే కన్‌సర్న్‌’, ‘జస్ట్‌ ఆస్కింగ్‌’ అంటూ సోషల్‌ మీడియాలో ప్రశ్నాస్త్రాలు సంధిస్తూ, ఇటీవలి కాలంలో రాజకీయ తెరపైనా ‘హాట్‌ టాపిక్‌’గా మారిన సినీ నటుడు ప్రకాష్‌రాజ్‌, సినిమాల్లేకపోవడంతోనే ఇలా వివాదాస్పద అంశాలతో పాపులర్‌ అవ్వాలనుకుంటున్నాడా.? ఈ ప్రశ్నకు సమాధానమేంటో తెలుసా.? ‘ఏడాదిన్నర వరకూ నా కాల్షీట్స్‌ ఖాళీ లేవు. వరుస సినిమాలతో బిజీగా వున్నాను. దొరికిన కొద్ది సమయంలోనే, సమాజం పట్ల అవగాహనతో ప్రశ్నిస్తున్నాను. చేతనైతే నా ప్రశ్నలకు సమాధానం చెప్పండి. సమాధానాలు చెప్పడం చేతకానివారే ఎదురు ప్రశ్నిస్తారు..’ అంటూ క్లారిటీ ఇచ్చేశాడు.

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా విషయమై పాలకులు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేస్తూ, విభజనతో ఆంధ్రప్రదేశ్‌కి అన్యాయం జరిగిందనీ ప్రకాష్‌రాజ్‌ చెప్పుకొచ్చారు. 2019 ఎన్నికల్లో తాను పోటీ చేయడంలేదనీ, అసలు ఏ రాజకీయ పార్టీలోనూ చేరడంలేదనీ, దేశంలో ఏ రాజకీయ పార్టీతోనూ స్నేహంగానీ, వైరంగానీ తనకు లేదని చెప్పారాయన.

‘ఓ హత్య జరిగింది. ఆ హత్య తర్వాత కొందరు సంబరాలు చేసుకున్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఇది దుర్మార్గం అని మాత్రమే నేను ప్రశ్నించాను. భారతదేశ ప్రజల్లో ఒకడిగా మాత్రమే, ప్రధాని నరేంద్రమోడీని ప్రశ్నించాను. దీన్ని బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న విషయంగా కొందరు చిత్రీకరించారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు ప్రకాష్‌రాజ్‌. ‘నాకు అత్యంత సన్నిహితురాలైన గౌరీ లంకేష్‌ హత్యతో, దుర్మార్గం నా గడప తొక్కింది గనుక, అప్పటినుంచే ప్రశ్నించడం మొదలు పెట్టాను’ అన్నది ప్రకాష్‌రాజ్‌ వాదన.

తాను మాట్లాడుతున్న మాటల్ని ఎవరైనా విభేదించొచ్చనీ, ఖండించొచ్చనీ, తననూ ప్రశ్నించవచ్చనీ, అయితే సమాధానం చెప్పలేక చంపేస్తాననడమే అరాచకమని ప్రకాష్‌రాజ్‌ అంటున్నారు. వ్యక్తిగతంగా తాను ఆవుని గౌరవిస్తాననీ, అలాగని ‘గో రక్షణ్‌’ పేరుతో మనుషుల్ని చంపేస్తామనేవారికి తాను వ్యతిరేకమని ప్రకాష్‌రాజ్‌ చెప్పారు.

‘నా ప్రశ్నలు కొనసాగుతాయి.. నన్ను చంపేంత తీరిక ఎవరికైనా వుంటే, ప్రయత్నించుకోవచ్చు. అంత పిరికితనం వారికి వుంటే, దాన్ని ఎదుర్కొనేంత ధైర్యం నాకుంది. నేను ప్రశ్నిస్తే, ఆ ప్రశ్నల్ని దేశంలో ఒకరిద్దరైనా అర్థం చేసుకుంటారన్న నమ్మకంతోనే ప్రశ్నిస్తున్నా. అన్నీ తెలిసినవాడు మౌనంగా వుండడమంటే, అది మరణంతో సమానం..’ అంటూ ప్రకాష్‌రాజ్‌ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.