పాంచ్ పటాకా : మీ డప్పు మీరు కొట్టుకోండి!

‘‘ఇందు మూలముగా యావన్మందికీ తెలియజేయడం ఏమనగా.. మేము ప్రముఖ మీడియా సంస్థగా మీరు గుర్తించ వలసి ఉన్నది. మేము రెండు తెలుగురాష్ట్రాల్లోనూ తిరుగులేని రీతిలో గాసిప్స్ ను ప్రచారంలో పెడుతూ.. ఆ రకంగా మా రేటింగులను పెంచుకుంటూ.. పురోభివృద్ధి సాధిస్తున్నామని.. మాతో ‘మంచి’ సంబంధాలు కలిగి ఉంటే మీ బతుకులు కూడా బాగుంటాయని కూడా తెలుసుకోవలెను.

ఇక తాజా సంగతి ఏమిటంటే.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎమ్మెల్యే పదవుల్లో ఉన్నవాళ్లు.. ఎవరి డప్పు వారే కొట్టుకోవడానికి మేం ఒక అవకాశం కల్పిస్తున్నాము. మా ఛానల్ ఏర్పాటు చేసే డప్పు కార్యక్రమంలో.. ప్రతి ఎమ్మెల్యే గురించి.. ఇంద్రుడని, చంద్రుడని.. రూపేణా నవమన్మధుడని.. ఇలా రకరకాలుగా మేము కీర్తించెదము. లేదా, మీరు జనం కోసం చా….లా పని చేసేసినట్టుగా మిమ్మల్ని మీరే అరగంట పాటు కీర్తించుకోవచ్చు. అయితే ఇందుకు గాను.. మాకు రొఖ్ఖము కేవలం 5లక్షల రూపాయలు మాత్రము చెల్లించవలెను’’ ఇలా సాగుతున్నాయి తెలుగునాట బేరాలు.

రెండు తెలుగురాష్ట్రాల్లో అంతో ఇంతో పాపులారిటీతో ఉన్న ఓ మీడియా గ్రూపు తమ ఛానెల్ లో ఎమ్మెల్యేల భజన కార్యక్రమాన్ని మొదలెట్టేసింది. మరి కొన్నినెలలు గడచి, ఎన్నికల దగ్గర పడితే.. దాదాపుగా అన్ని టీవీ ఛానెళ్లు ఇదే భజన ప్రారంభిస్తాయనే క్లారిటీ వారికి ఉన్నదేమో గనుక కాస్త తొందర పడ్డారు. ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గం గురించి.. ప్రోగ్రెస్ రిపోర్టు లాంటి ఒక కార్యక్రమం వారు వేస్తారు. ఆద్యంతమూ ఆ నియోజకవర్గం చాలా అద్భుతంగా డెవలప్ అవుతున్నదని, ఎమ్మెల్యే యిరగదీసేస్తున్నాడని మాత్రమే అందులో కథనాలు ఉంటాయి. దానికి తగ్గట్లుగా ఎమ్మెల్యే కూడా తన గురించి తాను.. ఆత్మస్తుతి చేసుకుంటారు.

ఈ ప్రహసనం మొత్తం నడిపించినందుకు సదరు ఛానెల్ వారు 5లక్షల రూపాయలు మాత్రం తీసుకుంటున్నారు. ఒకవైపు ఒక అధికార పార్టీకి అడ్డగోలుగా కొమ్ము కాస్తూ.. అధినేతకు అవసరమైన స్కెచ్ ప్రకారం.. ఇన్వెస్టిగేటివ్ కథనాలతో.. హాట్ చర్చలు పుట్టిస్తూ ఉండే సదరు ఛానెల్.. ఎమ్మెల్యేలను పిండుకుని తలకు 5లక్షలు వసూలు చేసుకోవడంలో మాత్రం పార్టీ భేదాలు పాటించడం లేదు. ఏ పార్టీ వారైనా సరే.. రొఖ్కం చెల్లిస్తే చాలు.. వారి భజన అరగంట పాటూ ఆ చానెల్ లో సాగించుకోవచ్చు.

అలా సాగుతోంది మరి మీడియా పోకడ.