సీక్వెల్‌కు ఒరిజినల్‌తో సాపత్యం అక్కర్లేదా?

సూపర్‌ హిట్‌ సినిమాలు ప్రాంచైజ్‌లుగా మార్చుకుని.. వాటితో వ్యాపారం చేసేస్తున్నారు సినీ జనాలు. సీక్వెల్‌ అనే పదానికి అర్థమే లేకుండా సినిమాలు వచ్చేస్తున్నాయి. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే ఈ వ్యవహారానికి ఎవరూ మినహాయింపు కాదు. హిందీ, తమిళ, తెలుగు.. ఇలా ప్రతిచోటా ఇదే జరుగుతోంది. సీక్వెల్స్‌ పేరుతో సినిమా వ్యాపారం చేస్తున్నారు. ఏ సినిమాకు మరే సినిమాను అయినా సీక్వెల్‌గా చెప్పుకోవచ్చు. అవతల బాలీవుడ్‌లో ఆషికీ, రాజ్‌, మర్డర్‌.. వంటి ప్రాంచైజ్‌లలో ఒక సినిమాకు మరో సినిమాకూ సంబంధం లేకుండా సీక్వెల్స్‌ అంటూ సినిమాలు తీస్తున్నారు. పొంతనలేని కథలు.. ఎలా సీక్వెల్స్‌ అవుతాయో అర్థంకాని విషయం.

ఇదిలా ఉంటే ఇలాంటి ట్రెండ్‌ తెలుగులో కూడా సాగుతోంది. రాజుగారిగది-2 వంటి సినిమాలు అలానే వచ్చిపోయాయి. కానీ.. ఇలా ఎన్ని సినిమాలు చేసినా, సీక్వెల్‌ అనే మాటకు జస్టిఫికేషన్‌ లేకపోతే జనాలకు కూడా ఈ సినిమాలు అంతగా ఎక్కవని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు. మొదట్లో ఇలాంటి జస్టిఫికేషనే ఉండేది. అయితే క్రమంగా దాన్ని గాలికి వదిలేశారు. ఉదాహరణకు మన దగ్గర వచ్చిన ఫస్ట్‌ సీక్వెల్స్‌ .. ‘మనీ’ సినిమాకు ‘మనీ మనీ’ అంటూ సీక్వెల్‌ తీశారు.

రెండు సినిమాల మధ్య చాలా సాపత్యం ఉంటుంది. మనీ సినిమా ఎక్కడ ముగిసిందో.. మనీ మనీ అక్కడ నుంచినే ప్రారంభం అవుతుంది. కొత్త పాత్రలు వస్తాయి కానీ.. పాత పాత్రలు, వాటి నేపథ్యాలు.. ఏ మాత్రం మారవు. వాటి తత్వాలు కూడా అదే విధంగా కొనసాగుతూ ఉంటాయి. అయితే మనీ మనీ సినిమాను నడిపించడానికి తగినంత సరుకు లేకపోయింది. అందుకే ఫస్ట్‌పార్టు హిట్టు అయినంత స్థాయిలో రెండోపార్టు హిట్‌ కాలేదు.

మొదట్లో తెలుగు వాళ్లు కానీ తమిళ వాళ్లు కానీ.. సీక్వెల్స్‌ కాన్సెప్ట్‌ను అంతగా పట్టించుకోలేదు. కానీ క్రమక్రమంగా అది అలవాటు అయ్యింది. దానికి బాలీవుడ్‌ ప్రభావమే ఎక్కువని చెప్పాలి. బాలీవుడ్‌లో కూడా మొదట్లో సీక్వెల్స్‌ మధ్య సాపత్యం ఉండేది… అయితే తర్వాత పరిస్థితి ఎలా తయారైందంటే సినిమాకు ఏదో ఒక టైటిల్‌ ఉండాలి కాబట్టి.. పాత సినిమా టైటిల్‌కు టూ అంటూ యాడ్‌ చేసి సినిమాలు వదులుతున్నారు. ఇలాంటి సినిమాలు చాలానే వస్తున్నాయి. అప్పుడెప్పుడో ఆషికీ తీశారు, అది హిట్టు. ఆ మధ్య వచ్చిన ఆషికీ-2 ఒక ప్రేమకథ.. దీనికీ మొదటి సినిమాకూ రవ్వంత కూడా సంబంధం లేదు. కానీ రెండోపార్టు సంచలన విజయం సాధించింది. ఇప్పుడు విశేషం ఏమిటంటే.. ఆషీకీ-3 అంటున్నారు. దీనికీ మొదటి రెండు పార్టులతో ఎలాంటి సంబంధం ఉండకపోవచ్చు.

అయితే బాలీవుడ్‌లో కొన్ని కొన్ని మినహాయింపులు ఉన్నాయి. వాటిల్లో మాత్రం కథాంశాన్ని ఒకే తరహాలో తీసుకుంటున్నారు. ఉదాహరణకు గోల్‌మాల్‌ సీరిస్‌, ధూమ్‌ సీరిస్‌. గోల్‌మాల్‌ సీరిస్‌లో నాలుగో సినిమానేమో వచ్చినట్టుగా ఉంది. వివిధ దక్షిణాది సినిమాలను హిందీలో రీమేక్‌ చేస్తూ వాటికి గోల్‌మాల్‌ టైటిల్‌ను తగిలిస్తున్నారక్కడ. ‘గోల్‌మాల్‌’ సినిమా దక్షిణాది సబ్జెక్టే. తెలుగులో కూడా ‘తప్పు చేసి పప్పుకూడు’గా విడుదల అయిన కాన్సెప్ట్‌నే గోల్‌మాల్‌గా రీమేక్‌ చేశారు. ఆ తర్వాత గోల్‌ మాల్‌ -2కి మరో సౌత్‌ సినిమానే కాన్సెప్ట్‌గా తీసుకున్నారు. అయితే గోల్‌మాల్‌ కథలన్నీ.. నలుగురు యువకుల మధ్య సాగే వ్యవహారాల్లా చూపించడం, నటీనటులను దాదాపుగా కొనసాగిస్తుండటంతో కొంతవరకూ జస్టిఫికేషన్‌ జరుగుతోంది.

ఇదిలా ఉంటే.. సీక్వెల్‌ అంటూ ఒకే కథతో మళ్లీ మళ్లీ సినిమా తీయడం కూడా కొంతమంది అనుసరిస్తున్న తెలివైన ఎత్తుగడ. ఉదాహరణకు లారెన్స్‌ ముని సీరిస్‌ను తీసుకోవచ్చు. బాలీవుడ్‌లో ధూమ్‌ సీరిస్‌ను ప్రస్తావించుకోవచ్చు. దాదాపు పుష్కరకాలం కిందట లారెన్స్‌ ముని సినిమాను చేశాడు. అదే కథాంశాన్నే కాస్త మార్చి ముని-2 కాంచనగా రూపొందించాడు. ఆపై ముని త్రీ వచ్చింది, ముని ఫోర్‌ రాబోతోంది. దాదాపు ఒకే కథాంశమే.. పాత్రలు, వాటి నేపథ్యాలు మాత్రమే మారుతూ ఉంటాయి. హారర్‌ కాన్సెప్ట్‌ కావడం, ప్రతిసారీ కొత్త థ్రిల్స్‌ ఇస్తూ ఉండటంతో ఆ సీరిస్‌ అలా కొనసాగుతోంది.

దేనికి బడితే దానికి సీక్వెల్సా…?

ఆ మధ్య ఇడియట్‌కు సీక్వెల్‌ అన్నారు, ఆపై రెడీకి సీక్వెల్‌ అన్నారు. ఇప్పుడు భారతీయుడికి సీక్వెల్‌ అంటున్నారు. ఆఖరికి ఎలా తయారైందంటే.. సినిమా వాళ్ల ఇంటర్వ్యూలు చూస్తే, మీ ఫలానా సినిమా హిట్టైంది కదా, దానికి సీక్వెల్‌ను తీసే ఉద్దేశం ఉందా? అని ప్రెస్‌ జనాలు అడుగుతున్నారు. ఆ మధ్య కృష్ణవంశీని అడిగారు.. అంత:పురం సినిమాకు సీక్వెల్‌ తీస్తారా? అని! ఇదెంత అసంబంద్ధమైన ప్రశ్ననో వేరే చెప్పనక్కర్లేదు. సినిమా ప్రస్తావన వచ్చింది కాబట్టి, దానికి సీక్వెల్‌ తీస్తారా? అని అడిగేయడమా? సీక్వెల్‌ అనేమాట ఎంత ప్రహసనంగా తయారైందో చెప్పడానికి ఈ ప్రశ్న చాలు.

మితం ఉండాలి..!

దేనికైనా కొంత కాలానికి ఎక్స్‌పైరీ ఉంటుంది.. సీక్వెల్స్‌కు కూడా అంతే. తమిళ సింగం సీరిస్‌ పరిస్థితి అదే. మూడోపార్టు వచ్చేసరికి జనాలకు కూడా ఆ కాన్సెప్ట్‌పై మొహం మొత్తింది. మూడోపార్టు ఫెయిల్‌ అయిన తీరుతో మళ్లీ దీనికి సీక్వెల్‌ రాకపోవచ్చు. ఒకే నేపథ్యంతో పదే పదే సినిమాలు తీస్తే ఇలా మొహం మొత్తుతాయి. వేర్వేరు కథలను తెచ్చి.. సీక్వెల్స్‌ టైటిల్స్‌ పెడుతూపోతే న్యాయం జరగదు. కాబట్టి.. ఈ సీక్వెల్‌ హెచ్చులకు పోకపోవడమే మేలని చెప్పాలి.

భారతీయుడు-2 అంట ఏం తీస్తారు?

భారతీయుడు సినిమా కథకే లాజిక్‌ లేదు. ప్రజల్లో అవినీతిపై ఉన్న అసహనం విషయంలో సైకో ప్లజర్‌ను ఇవ్వడంలో ఆ సినిమా విజయవంతం అయ్యింది. అక్కడికీ ఆ సినిమా చేయడానికి మునుపే కమల్‌ కథ విషయంలో బోలెడు సందేహాలు వ్యక్తం చేశాడట. స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న యువకుడు.. స్వతంత్రం వచ్చేసిన తర్వాత దేశంలో ఏం జరుగుతోందో పట్టించుకోలేని స్థితిలో ఉంటాడా? అంత ముసలి అయ్యేంత వరకూ లంచం గురించి తెలియనట్టుగా ఉంటాడా? అనేది కమల్‌ శంకర్‌ దగ్గర వ్యక్తంచేసిన సందేహం. అప్పటికే ఆ సినిమా అనౌన్స్‌ అయిపోయింది. కథతో కమల్‌ కన్వీన్స్‌ కాలేకపోయాడు. చివరకు బతిమాలి బతిమాలి కమల్‌ను ఒప్పించుకున్నాడట ఏఎం రత్నం. భారతీయుడు కథ విషయంలోనే అలాంటి బాలారిష్టాలు ఎదురయ్యాయి.

ఇప్పుడు భారతీయుడు-2 అంటున్నారు.. ఏం తీస్తారు? భారతీయుడు సినిమాలో ఒక కమల్‌ చనిపోతాడు, రెండో కమల్‌కు ఇప్పటికి వందేళ్లు వచ్చి ఉంటాయి. ఇలాంటి నేపథ్యంలో పార్ట్‌ టూలో ఏం చూపుతారు? కమల్‌తో తీసినా, వేరే హీరోతో తీసినా వేరే కథను అయితే వెదుక్కోవాలి. నేటి తరానికి తగ్గ భారతీయుడిని చూపాలి. అలాంటప్పుడు.. పాత టైటిల్‌ మాత్రం ఎందుకు? రీఫ్రెష్‌ నెస్‌ ఇవ్వొచ్చుగా?