పాపం క్యాథరీన్: మరోసారి మోసపోయింది

మోసపోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఖైదీ నంబర్ 150 విషయంలో క్యాథరీన్ కు తీరని అన్యాయం జరిగింది. ఆఖరి నిమిషంలో ఐటెంసాంగ్ నుంచి ఆమెను తప్పించారు. అప్పట్లో ఈ వ్యవహారం పెద్ద దుమారం రేపింది. ఆ సినిమా విషయంలో క్యాథరీన్ కు లక్ష్మీరాయ్ అడ్డుగా నిలిస్తే.. ఈసారి కాజల్ నుంచి సమస్య ఎదురైంది.

తమిళ్ లో హిట్ అయిన బోగన్ అనే సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు రవితేజ. ఈ సినిమాలో హీరోయిన్ గా మొదట క్యాథరీన్ పేరునే అనుకున్నారు. ఓ మొబైల్ షాప్ ఓపెనింగ్ కు వచ్చినప్పుడు క్యాథరీన్ కూడా ఈ విషయాన్ని చూచాయగా ప్రకటించింది. కానీ ఇప్పుడు ఆ సినిమా నుంచి క్యాథరీన్ ను తప్పించారు. ఆమె స్థానంలో కాజల్ ను తీసుకోవాలనుకుంటున్నారు.

నిజానికి రవితేజ-కాజల్ ది హిట్ కాంబినేషన్ కాదు. గతంలో వీళ్లిద్దరూ కలిసి నటించిన వీర, సారొచ్చారు సినిమాలు రెండూ ఫ్లాప్ అయ్యాయి. కానీ క్యాథరీన్ తో పోలిస్తే స్టార్ డమ్ ఎక్కువ కాబట్టి కాజల్ వైపే యూనిట్ మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. దీంతో క్యాథరీన్ మరోసారి మోసపోయిందంటూ తోటి హీరోయిన్లు చెవులు కొరుక్కుంటున్నారు.