‘పిట్టలు’ కాదు పవన్‌.. ట్వీట్లు కావాలి.!

పవన్‌కళ్యాణ్‌కి రెండు ట్విట్టర్‌ పిట్టలున్నాయిప్పుడు. కొత్త ట్విట్టర్‌ అకౌంట్‌ని సినిమా విశేషాల కోసం ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన పవన్‌కళ్యాణ్‌, ఇండియన్‌ సినిమాకి లెజెండ్స్‌ అయిన దాదా సాహెబ్‌ ఫాల్కే, రఘుపతి వెంకయ్య పట్ల గౌరవం, అభిమానాన్ని తెలియజేస్తూ తొలి ట్వీటేశారండోయ్‌.! ఇకపై, ఈ కొత్త అకౌంట్‌ ద్వారా సినిమా విశేషాల్ని అభిమానులకు పవన్‌ అందిస్తారన్నమాట.

సినిమా ‘పిట్ట’ సంగతి సరే, పొలిటికల్‌ ‘పిట్ట’ సంగతేంటట.? పవన్‌కళ్యాణ్‌ పేరు మీద కొన్నాళ్ళ క్రితం ట్విట్టర్‌ అకౌంట్‌ ప్రారంభమయ్యింది.. మధ్యలో అది హ్యాక్‌కి గురయ్యింది.. మళ్ళీ లైన్‌లోకొచ్చింది. ప్రత్యేక హోదా మీద మాట్లాడింది, పలు రాజకీయ అంశాలపైనా భలే ‘కూతలు’ కూసింది. కానీ, ఆ కూతలు చాలా చాలా చాలా తక్కువ. ఒక్కోసారి వరుస ‘కూతలు’ పెట్టిన ఆ పిట్ట, ఒక్కోసారి నెలల తరబడి ‘గ్యాప్‌’ కూడా తీసుకుందండోయ్‌.! అయినాగానీ, ఆ పిట్టకి 2 మిలియన్‌ల మంది ఫాలోవర్స్‌ వున్నారు. అదీ పవన్‌కళ్యాణ్‌ స్టామినా.

కొత్త ట్విట్టర్‌ పిట్టకి అప్పుడే 30 వేల మంది ఫాలోవర్స్‌ వచ్చిపడ్డారంటే, పవన్‌కళ్యాణ్‌కి వున్న ఫాలోయింగ్‌ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఎంత ఫాలోయింగ్‌ వుండి ఏం లాభం.? తనను ఫాలో అయ్యేవారిని పవన్‌ కనీసం పట్టించుకోరాయె. పొలిటికల్‌ పిట్టలానే, సినిమా పిట్ట కూడా అభిమానుల్ని నిరాశపరుస్తుందా.? అమావాశ్యకీ పున్నమికీ ట్వీట్లేస్తూ అభిమానుల్ని ఉస్సూరుమన్పిస్తుందా.? అంతే, అందులో డౌటేముంది.!

ఎన్ని అక్కౌంట్లు వున్నాయన్నది కాదు.. ఆ ట్విట్టర్‌ పిట్టల నుంచి ట్వీట్లు కావాలి.. అది పొలిటికల్‌ పిట్ట నుంచైనా, సినిమా పిట్టనుంచైనా.. పవన్‌ సారూ కాస్త అభిమానులకోసమైనా మారతారా.? వేచి చూడాల్సిందే.