ప్రతిపక్షం లేని అసెంబ్లీ.. రేపట్నుంచే కానీ.!

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు రేపటినుంచి పది రోజులపాటు జరగనున్నాయి. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌, ‘ప్రజా సంకల్పం’ పేరుతో నిర్వహిస్తోన్న పాదయాత్రలో బిజీగా వున్నారు. మరోపక్క, తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో పార్టీ ఫిరాయించేలా చేసి, వారిలో కొందరికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టిన చంద్రబాబు సర్కార్‌ తీరుకి నిరసనగా, అసెంబ్లీ సమావేశాల్ని బాయ్‌కాట్‌ చేసింది ప్రతిపక్షం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ.

దాంతో, రేపటినుంచి జరిగే ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం కన్పించదు. మరి, అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోతే, అసెంబ్లీ కార్యకలాపాలెలా సాగుతాయి.? ఈ ప్రశ్నకూ అధికార పార్టీ దగ్గర సమాధానముంది. ప్రతిపక్షం ‘స్పేస్‌’ని కూడా (అంటే టైమ్‌ని అన్న మాట) అధికార పార్టీ ఎమ్మెల్యేలే ‘ఫిలప్‌’ చేసేస్తారట. మొత్తం, 175 నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యల్నీ, అధికార పార్టీకి చెందిన శాసనసభ్యులే ప్రస్తావిస్తూ అసెంబ్లీ సమావేశాల్ని నిర్వహించేస్తారట.

‘నిబంధనలకు అనుగుణంగానే అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి..’ అంటూ అధికార పార్టీ నుంచి పసలేని ప్రకటనలు వస్తుండడం మామూలే. మరోపక్క, ‘రేపటి వరకూ సమయం వుంది.. స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌, పార్టీ ఫిరాయించిన తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటారో లేదో చెప్పాలి.. చర్యలు తీసుకుంటే, ఖచ్చితంగా అసెంబ్లీకి హాజరవుతాం..’ అంటోంది ప్రతిపక్షం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ.

అయితే, ‘నేను చర్యలు తీసుకోకముందే, ప్రతిపక్షం తొందరపడి న్యాయస్థానాల్ని ఆశ్రయించింది గనుక, నేను చెయ్యగలిగిందేమీ లేదు..’ అని స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌, బుకాయించే ప్రయత్నం చేస్తున్నారనుకోండి.. అది వేరే విషయం.

ప్రతిపక్షం లేకపోతే, అసెంబ్లీ ఎలా వుంటుంది.? చాలా చప్పగా సాగుతుంది. మీడియా పాయింట్‌ వద్ద హంగామా కన్పించదు, అసెంబ్లీ లాబీల్లో హడావిడి వుండదు. అసెంబ్లీలోపలా వాతావరణం ‘మమ’ అన్నట్లే వుంటుంది. అంతేనా.? అలా కాకుండా, అధికార పార్టీ తమదైన వ్యూహాలతో అసెంబ్లీ సమావేశాలకు సమాయత్తమవుతోందట. ప్రతిపక్షం ఎటూ వుండదు గనుక, ప్రతిపక్షాన్ని టార్గెట్‌ చేస్తూ, అధికార పార్టీ నేతల ప్రసంగాలు జోరుగా కన్పిస్తాయట. టీడీపీ అసెంబ్లీ వ్యూహ కమిటీ ప్రోగ్రామ్ ని పక్కగా డిజైన్ చేసిందట. ఒక్క మాటలో చెప్పాలంటే, తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీటింగులా వ్యవహారం సాగుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదేమో.

ఇంతకీ, ప్రతిపక్షం లేని అసెంబ్లీలో టీడీపీ మిత్రపక్షం బీజేపీ పాత్ర ఎలా వుండబోతోందట.? ఏమో, వేచి చూడాల్సిందే.