ప్రారంభించిన చోటుకే మళ్లీ వస్తుందా?

ఒకప్పటి అందాల కథానాయిక, టాలీవుడ్‌లోనే కాదు బాలీవుడ్‌లో సైతం విజయపతాక ఎగరేసి, అక్కడి రాజకీయాలతో మమేకమైపోయిన జయప్రద రాజకీయ జీవితచక్రం మళ్లీ ప్రారంభించిన చోటుకే వచ్చి ఆగుతోందా? ఇందుకు ‘అవును’ అని జవాబు చెప్పకోవాలి. ఇది మనం చెబుతున్న మాట కాదు. ఆమే ఈ సంకేతాలిచ్చారు. సినిమా రంగంలో టాప్‌లో ఉన్నప్పుడే ఆమె రాజకీయ జీవితం టీడీపీ నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే కదా. ఆ తరువాత జరిగిన పరిణామాల్లో ఆమె ఉత్తరప్రదేశ్‌కు వెళ్లిపోయి సమాజ్‌వాదీ పార్టీలో చేరి రెండుసార్లు లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు. యూపీ రాజకీయ జీవితం ముగిసిపోయిన జయప్రదకు మళ్లీ తన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ గుర్తుకొచ్చింది. మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్‌ కావాలని నిర్ణయించుకున్న ఈ మాజీ హీరోయిన్‌ ఆ పని స్వరాష్ట్రం నుంచే ప్రారంభించాలనుకున్నారు.

ఏ పార్టీలో చేరాలో ఇంకా నిర్ణయించుకోలేదని, కాని త్వరలోనే తెలుగు రాజకీయాల్లోకి మళ్లీ వస్తున్నానని చెప్పారు. ఆమె చెబుతున్నదాన్నిబట్టి చూస్తే టీడీపీలో చేరాలని ప్లాన్‌ చేసుకున్నట్లుగా ఉంది. ఏపీపై ఆమె కన్నేసిన విషయం కొత్తది కాకపోయినా ఇప్పుడు మరింత స్పష్టతనిచ్చారు. చేరబోయే పార్టీ ఏదో చెప్పేస్తే ఓ పనైపోతుంది. తాజాగా ఏపీకి వచ్చిన జయప్రద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఎంతో ప్రశంసించారు. రాజధాని నిర్మాణం చిన్నవిషయం కాదంటూ, ఈ విషయంలో బాబు చేస్తున్న కృషి అమోఘంగా ఉందన్నారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహకరించాలన్నారు. ఇంతవరకూ బాగానేవుందిగాని బాబుకు నచ్చని ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కని, కేంద్రం దాన్ని పక్కన పెట్టడం మంచిది కాదన్నారు.

తనకో రాజకీయ లక్ష్యం ఉందంటూ ఏ పార్టీలో చేరబోయేది త్వరలోనే చెబుతానన్నారు. తెలుగు రాజకీయాల్లోకి రావాలని జయప్రద గట్టిగానే నిర్ణయించుకున్నారు. సినిమా నటిగా గ్లామర్‌ ఉండటమే కాకుండా, దీర్ఘకాలం యూపీ రాజకీయాల్లో ఢక్కామొక్కీలు తిని, రెండుసార్లు ఎంపీగా పనిచేసిన అనుభవం ఉండటంతో ఆమె చేరబోయే పార్టీకి ఇదంతా ప్లస్‌ అవుతుంది. రాజకీయ నాయకులు ఒక పార్టీలో భవిష్యత్తు లేదనుకుంటే మరో పార్టీని వెదుక్కుంటారు. రాజకీయాల్లో కంటిన్యూగా ఉండటానికి ఏదో ఒక పార్టీ కావాలి. అది సొంత రాష్ట్రమైనా, పొరుగు రాష్ట్రమైనా కొందరు పట్టించుకోరు. జయప్రదదీ ఆదే అభిప్రాయం.

కొంతకాలం కిందట ‘ఐ యామ్‌ వెయింటింగ్‌ ఫర్‌ ఎ గుడ్‌ పార్టీ’ అని ఓ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. మళ్లీ ఉత్తరప్రదేశ్‌కు వెళ్లి అక్కడి రాజకీయాల్లో ఆజంఖాన్‌తో గొడవలు పడలేనని, ఇప్పటివరకు చేసిన పోరాటం చాలని అన్నారు. సో…యూపీ రాజకీయాలకు శుభం కార్డు వేసేశారు. యూపీ రాజకీయాల్లో కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నప్పుడు ఒకసారి ఏపీకి వచ్చిన సందర్భంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ప్రశంసలతో ముంచెత్తారు. ఒకవేళ తెలుగు రాజకీయాల్లోకి వస్తే టీడీపీలో చేరుతుండవచ్చని అప్పుడే అనిపించింది. కాని అదే ఇంటర్వ్యూలో ‘ఎన్టీఆర్‌గారికి నా మీద ఉన్నంత అభిమానాన్ని చంద్రబాబుగారి నుంచి ఎక్స్‌పెక్ట్‌ చేయలేను’ అని చెప్పారు.

మళ్లీ ఇప్పుడు చంద్రబాబును ఆకాశానికి ఎత్తేయడంతోపాటు ప్రత్యేక హోదా గురించీ మాట్లాడటం చూస్తే కొంత అస్పష్టత కనబడుతోంది. మళ్లీ తెలుగు రాజకీయాల్లో ప్రవేశించాలనే ఆలోచన వచ్చేసరికి రాష్ట్రం రెండు ముక్కలైంది. రాష్ట్రాన్ని వదిలేసి చాలా ఏళ్లయిపోయిన నేపథ్యంలో ఇక్కడి రాజకీయాలను ఆమె అర్థం చేసుకోగలరా? రాజకీయాల్లో సీనియర్‌ అయినప్పటికీ విభజన తరువాత తొలిసారిగా తెలుగు రాజకీయాల గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి ఇక్కడ కొత్తగా అరంగేట్రం చేస్తున్నట్లే లెక్క.