ప్ర‌దీప్ అక్క‌డే ఉన్నాడంటూ ప్ర‌చారం

ఉన్న త‌ల‌నొప్పులు స‌రిపోవ‌న్న‌ట్లు.. కొత్త త‌ల‌నొప్పుల్ని పిలిచి మ‌రీ ఆహ్వానిస్తున్న‌ట్లుగా ఉంది టీవీ యాంక‌ర్‌.. సినీ న‌టుడు ప్ర‌దీప్ తీరు చూస్తే. డిసెంబ‌రు 31 పూటుగా తాగేసి డ్రంక్ అండ్ డ్రైవ్ త‌నిఖీల్లో దొరికేయ‌ట‌మే కాదు.. భారీగా తాగిన విష‌యం పోలీసులు జ‌రిపిన ప‌రీక్ష‌ల్లో వెల్ల‌డైంది. 178 పాయింట్లు చూపిన నేప‌థ్యంలో జైలుశిక్ష ఖాయ‌మ‌న్న మాటను ప‌లువురు చెబుతున్నారు.

ఇదిలా ఉండ‌గా.. పోలీసుల కౌన్సెలింగ్‌కు హాజ‌రై.. త‌ర్వాత న్యాయ‌స్థానానికి వెళ్లాల్సిన ప్ర‌దీప్‌.. ప‌త్తా లేకుండా పోవ‌టం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. ఇలాంటి ప‌నులు కొంద‌రు చేస్తున్నా.. ప్ర‌ముఖులు ఇలాంటివి చేయ‌టానికి ఇష్ట‌ప‌డ‌రు. మీడియా దృష్టి ప్ర‌త్యేకంగా ఉండ‌టంతో.. లేనిపోని ర‌చ్చ చేసుకోవ‌టం ఎందుకన్న ఆలోచ‌న‌లో ఉంటారు. కానీ.. ప్ర‌దీప్ తీరు మాత్రం అందుకు భిన్నంగా ఉంది.

పోలీసుల ఎదుట హాజ‌రు కావాల్సి ఉన్నా.. హాజరు కాక‌పోవ‌టంతో.. ఆయ‌న కోసం వెళ్లిన పోలీసుల‌కు తాళం క‌ప్ప ఎదురైంద‌ని చెబుతున్నారు. దీంతో కూక‌ట్ ప‌ల్లి లోని ఆయ‌న కార్యాల‌యంలోనూ ఆయ‌న రాలేద‌ని చెప్ప‌టంతో.. పరారీలో ఉన్న‌ట్లు ప్ర‌క‌టించాలా? అన్న‌ది ఇప్పుడు పోలీసుల‌కు పెద్ద ప్ర‌శ్న‌గా మారింది.

విచార‌ణ‌కు రావాల్సిన ప్ర‌దీప్ రాలేద‌న్న మాట‌తో ఒక్క‌సారి మీడియా ఫోక‌స్ ఆయ‌న మీద ప‌డింది. కొన్ని ఛాన‌ల్స్ లో ప్ర‌దీప్ మ‌ణికొండ‌లోని గెస్ట్ హౌస్ లో ఉన్న‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఇవ‌న్నీ చూస్తే.. లేనిపోని త‌ల‌నొప్పుల్ని కోరి మ‌రీ ఆహ్వానించిన‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు. అయితే.. చ‌ట్టంలోని కీల‌క‌మైన లొసుగు ఆధారంగానే ప్ర‌దీప్ ఇలా చేస్తున్నారా? అన్న వాద‌న వినిపిస్తోంది. డ్రంక్ అండ్ డ్రైవ్ లో ప‌ట్టుబ‌డిన వారు పోలీసుల ఎదుట ఎన్ని రోజుల వ్య‌వ‌ధిలో హాజ‌రు కావాల్సి ఉంటుంద‌న్న విష‌యంపై క్లారిటీ లేద‌ని.. దీన్ని ఆధారంగా చేసుకొని ఎవ‌రికి క‌నిపించ‌కుండా పోయి ఉంటార‌ని చెబుతున్నారు. ఫోన్లో కాంట్రాక్ట్ చేయాల‌నుకున్న వారికి కూడా ఆయ‌న ఫోన్ స్విచ్ఛాప్ చేయ‌టంతో.. పోలీసుల త‌ర్వాత స్టెప్ ఏమిట‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.