కరోనా వైరస్ భయంతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో సినిమాల ప్రదర్శన ఆగిపోయింది. షూటింగులు ఆగిపోయాయి. ఇతర సినీ కార్యకలాపాలన్నింటికీ కూడా బ్రేక్ పడింది. మామూలుగా ఉగాది రోజు టాలీవుడ్లో కొత్త సినిమాల ప్రారంభోత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతుంటాయి. అలాగే మేకింగ్ దశలో ఉన్న సినిమాల విశేషాలూ పంచుకుంటారు. కానీ ఈ కల్లోల సమయంలో అలాంటివేమీ వద్దని చాలామంది ఆగిపోయారు.
కానీ రాజమౌళి అండ్ కో మాత్రం భిన్నంగా ఆలోచించింది. లాక్ డౌన్ నేపథ్యంలో ఒక రకమైన అసహనంతో ఉన్న జనాలకు కొంత ఉపశమనం ఇద్దాం అన్న ఆలోచనతో మోషన్ పోస్టర్, సీతారామరాజు క్యారెక్టర్ టీజర్ రిలీజ్ చేసినట్లు జక్కన్న వెల్లడించాడు. వీటికి జనాల నుంచి మంచి స్పందనే వచ్చింది.
ఇప్పుడు అల్లు అర్జున్ కొత్త సినిమా బృందం కూడా ఇదే తరహాలో ఆలోచిస్తున్నట్లు సమాచారం. సుకుమార్ దర్శకత్వంలో బన్నీ చేయాల్సిన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. కరోనా కారణంగా మొత్తం ప్లానింగ్ అంతా దెబ్బ తినేసింది. ఈ కాంబినేషన్లో సినిమా ఓకే అయి ఏడాది దాటుతున్నా చిన్న అప్ డేట్ కూడా లేకపోవడం అభిమానుల్ని నిరాశ పరుస్తోంది.
సుక్కు చివరి సినిమా ‘రంగస్థలం’ రిలీజై రెండేళ్లు పూర్తయిపోవడంతో ఆయన మీదా విమర్శలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో బన్నీ, సుక్కుల అభిమానులకు ఊరటనిచ్చేందుకు కనీసం సినిమా ఫస్ట్ లుక్ అయినా రిలీజ్ చేయాలని ఫిక్సయిందట చిత్ర బృందం. ఇందుకు మంచి టైమింగ్ కూడా కుదిరింది. ఏప్రిల్ 8న బన్నీ పుట్టిన రోజు. ఇప్పటికే బన్నీ పాత్రకు సంబంధించి ఒక ఫొటో షూట్ కూడా చేశారు. అది చాలా బాగా వచ్చిందని సమాచారం. ఆ షూట్ నుంచి కొన్ని ఫొటోలు ఎంచుకుని ఫస్ట్ లుక్ మీద వర్క్ చేస్తున్నారట. ఇంకో వారంలో సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ కావడం దాదాదాపు లాంఛనమే అంటున్నారు.