బాబుతో బేరం : తిట్టకుండా బయటకు!

లండన్ నుంచి రావడమే చంద్రబాబునాయుడు తెలంగాణ తెలుగుదేశం పార్టీ సంక్షోభం మీదనే తొలుత దృష్టి సారించారు. పార్టీ మీటింగు పెట్టుకుని రేవంత్ తో సహా, కీలక నాయకుల్ని అందరినీ పిలిపించి… కలివిడిగానూ విడివిడిగానూ వారితో మాట్లాడి మొత్తానికి రేపు అమరావతికి వచ్చేయండి అక్కడ తేల్చేద్దాం అని చెప్పి సెలవు తీసుకున్నారు. అయితే భేటీల్లో ఏం తేలినట్టు? ఆంతరంగిక వర్గాలనుంచి తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. రేవంత్ రెడ్డి ఇకపై తెలుగుదేశం నాయకులు ప్రత్యేకించి ఏపీకి చెందిన నాయకులను తిట్టకుండా ఉండేలాగా, ఓటుకు నోటు కేసు గురించి గానీ ఎక్కడ బయట మాట్లాడకుండా ఉండేలాగా చంద్రబాబునాయుడు ఒక ఒప్పందం చేసుకున్నట్లుగా విశ్వసనీయంగా తెలుస్తోంది.

చంద్రబాబునాయుడు పార్టీ సమావేశంలో చాలా అతిజాగ్రత్తగా వ్యవహరించారు. సమావేశానికి ముందే ఆయన పార్టీ అధ్యక్షుడు రమణను కలిసి వివరాలు తెలుసుకున్నప్పటికీ.. సమావేశం మొదలయ్యాక మళ్లీ రమణ ద్వారా ఈ వివాదానికి సంబంధించి వివరాలు తెలుసున్నారు. ఈలోగా మోత్కుపల్లి, అరవింద్ కుమార్ ఏదో చెప్పబోగా వారిని స్వయంగా చంద్రబాబే అడ్డుకున్నారు. వారిద్దరూ రేవంత్ పై ఒంటికాలిపై లేస్తున్న నేపథ్యంలో.. రేవంత్ కూడా హాజరైన ఆ సమావేశంలో వారి మాటలు.. మళ్లీ రేవంత్ పెట్రేగడానికి కారణం అవుతాయని ఆయన ఆలోచన అంటున్నారు.

ఈ సమావేశం ముగిశాక చంద్రబాబు రేవంత్ రెడ్డితో ఆంతరంగికంగా భేటీ అయ్యారు. వారిద్దరూ మాత్రమే విడిగా కూర్చుని మాట్లాడుకున్నారు. ఈ ఎపిసోడ్ ఎలా ఒక ముగింపునకు తీసుకురావాలనే విషయంలో ఈ భేటీలోనే అసలు చర్చ జరిగినట్లుగా సమాచారం. మొత్తానికి రేవంత్ రెడ్డి కేసీఆర్ వ్యతిరేక ప్రసంగాలు తప్ప.. తెలుగుదేశం మీద నిందలు వేయకుండా, ఆ రకంగా తెలుగుదేశానికి నష్టం చేయకుండా, ప్రత్యేకించి ఏపీలోని తెలుగుదేశానికి కూడా నష్టం జరిగేలా వ్యవహరించకుండా కాంగ్రెస్ లోకి వెళ్లిపోవాలని చంద్రబాబు సూచించినట్లుగా చెప్పుకుంటున్నారు.

రేవంత్ శృతిమించితే అది వ్యక్తిగతంగా చంద్రబాబునాయుడును కూడా ఇరుకున పెట్టే వ్యవహారంగా మారుతుంది గనుక.. ఆయనను ప్రసన్నంగా ఉంచుకుంటూనే.. పార్టీకి రాజీనామా చేసేయాల్సిందిగా చంద్రబాబు కోరినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఇవాళ రేపటిలోగా రేవంత్ రాజీనామా గురించి అధికారిక ప్రకటన ఉంటుందని కూడా అనుకుంటున్నారు.