బాబూమోహనా.. ఏందీ గోల.?

బాబూమోహన్‌ సినీ నటుడు మాత్రమే కాదు, రాజకీయ నాయకుడు కూడా. గతంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో మంత్రిగా కూడా పనిచేశారీయన. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా పనిచేస్తున్న బాబూమోహన్‌, వివాదాస్పదంగా వార్తల్లోకెక్కారు. ఓ అధికారికి ఫోన్‌లో బాబూమోహన్‌ వార్నింగ్‌ ఇస్తోన్న వైనం హాట్‌ టాపిక్‌ అయ్యింది.

తహసీల్దారు సరిగ్గా పనిచేయడంలేదన్నది బాబూమోహన్‌ ఆరోపణ. తనకు నచ్చని విధంగా పనిచేసినందుకుగాను బాబూమోహన్‌, సదరు తహసీల్దారుపై విరుచుకుపడిపోయారు. ఎమ్మెల్యే కాబట్టి, అధికారులపై చిర్రుబుర్రులాడటం సహజమే. కానీ, ఈ క్రమంలో బాబూమోహన్‌ ఉపయోగించిన ‘బూతులు’ వివాదాస్పదమవుతున్నాయి.

నిజానికి, తెలంగాణలో సరికొత్త రాజ్యాంగం (దీన్ని గులాబీ రాజ్యాంగం అనాలేమో) అమల్లో వుందిప్పుడు. కలెక్టర్లపైనా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు విరుచుకుపడిపోతున్నారు. వారితో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు కొందరు ‘ఔత్సాహిక’ ఎమ్మెల్యేలు. కలెక్టర్ల పరిస్థితే ఇలా వుంటే, ఇంకా చిన్న చిన్న అధికారులు, ఉద్యోగుల పరిస్థితి ఏంటట.? సో, బాబూమోహన్‌ తెలంగాణలో గులాబీ రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నారనుకోవాలేమో.

ప్రజా ప్రతినిథులు హుందాతనం ఏనాడో మర్చిపోయారు. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. తహసీల్దారు వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఏకంగా దాడికి దిగితే, ఆ ఘటనలో తన్నులు తిన్న తహసీల్దారుదే తప్పని తేల్చారు చంద్రబాబు. కాబట్టి, తెలుగు రాష్ట్రాల్లో ప్రజా ప్రతినిథుల నుంచి ‘సంస్కారం’ ఆశించడం అత్యాశే అవుతుంది.

నువ్వెంత.. నీ బతుకెంత.. నీ ఉద్యోగమెంత.? అని అధికారుల్ని ఉద్దేశించి రాజకీయ నాయకులు అనేస్తున్నారుగానీ, మీ పదవులెంత.? మీ బతుకులెంత.? అని రాజకీయ నాయకుల్ని ఉద్యోగులు ప్రశ్నిస్తే, వారి పరువేమవుతుందట.?