సోషల్ మీడియాలో ఎటు చూసినా ‘కరోనా’ గురించిన ముచ్చట్లే. కానీ, ఆ కరోనా ముచ్చట్లను మించిపోయేలా వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి సంబంధించిన ఆణిముత్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నవరత్నాల గురించి విన్నాంగానీ, ఈ ఆణిముత్యాలేంటి.? అంటే, వున్నాయ్.. చాలానే వున్నాయ్. అందులో పారాసిటమాల్, బ్లీచింగ్ పౌండర్ వంటివన్నమాట.
నిజమే, కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా బ్లీచింగ్ పౌడర్ని కూడా ఉపయోగిస్తుంటారు.. అది పరిసరాల పరిశుభ్రత కోసం. బ్లీచింగ్ పౌడర్‌తోనే, కరోనాని నివారించగలిగితే.. అసలంటూ కరోనా వైరస్ (కోవిడ్ 19) ప్రపంచమంతా ఎలా విస్తరిస్తుంది.? ఈ మాత్రం ఇంగితం ప్రదర్శించలేకపోయారు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అధికారిక ప్రెస్మీట్లో. అన్నట్టు, కరోనా ఎక్కడ పుట్టిందో తెలుసా.? ఎక్కడి నుంచి విస్తరించిందో తెలుసా.? ఇంకెక్కడి నుంచి సౌత్ కొరియా నుంచి అట.! ఇది వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిగారి మరో ఆణిముత్యం.
మాట్లాడేటప్పుడు కొన్ని పదాలు తప్పు దొర్లడం మామూలే. కానీ, చైనా ద్వారా ప్రపంచానికి కరోనా వైరస్ వ్యాప్తి చెందిందని.. సాక్షాత్తూ అమెరికా అధ్యక్షుడు గగ్గోలు పెడుతున్నాడు. చంటి పిల్లాడు సైతం ఇప్పుడు చైనా పేరు చెబితే భయపడుతున్నాడు. కానీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాత్రం, కరోనా వైరస్ చైనా కాదు, సౌత్ కొరియా నుంచి వ్యాపించిందని చెబుతున్నారు. ఇవి కాక, వైఎస్ జగన్ నుంచి చాలా ఆణిముత్యాలు పుట్టుకొచ్చాయి. అవన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.
నారా లోకేష్ ఇలా మాట్లాడేటప్పుడు కుప్పలు తెప్పలుగా ఆణిముత్యాల్ని వదిలేవారు. దాంతో ఆయనకి ‘పప్పు’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే పేరు పెట్టింది. మరి, ముఖ్యమంత్రి పదవిలో వున్న వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి వదులుతున్న ఆణిముత్యాలకి ఏ పేరు పెట్టాలి.? అని టీడీపీ సహా ఇతర రాజకీయ పార్టీలకు మద్దతుదారులైన నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
పాపం, వైఎస్ జగన్ సానుభూతిపరులకి, తమ అభిమాన నాయకుడి ఆణిముత్యాల్ని ఎలా ‘కవర్’ చేసుకోవాలో కూడా అర్థం కాని దుస్థితి. అదృష్టం ఆంధ్రప్రదేశ్ తలుపుతట్టి, స్థానిక ఎన్నికలు వాయిదా పడ్డాయిగానీ.. లేదంటే పరిస్థితి ఎలా వుండేదో ఏమో.. తలచుకుంటనే భయమేస్తోందని రాష్ట్ర ప్రజలు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాల్ని వెల్లడిస్తున్నారు.