బాలకృష్ణుడులో కొత్తదనం ఎక్కడ?

నారా రోహిత్ సినిమాలు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. కొత్తగా ఉండే కథలు ఎంచుకుంటాడు. తన పాత్ర సంథింగ్ స్పెషల్ గా ఉండేలా చూసుకుంటారు. ఈ హీరో గత చిత్రాలు చూస్తే ఈ విషయం అర్థమౌతుంది. అలాంటి హీరో ఇప్పుడు పూర్తిగా ట్రాక్ మార్చాడు.

సగటు తెలుగు కమర్షియల్ హీరోలు చేసే రెగ్యులర్ మాస్ మసాలా సబ్జెక్ట్ ఎంచుకున్నాడు. అదే బాలకృష్ణుడు. తాజాగా ఈ సినిమా ట్రయిలర్ విడుదలైంది. ట్రయిలర్ నిండా మాస్ ఫైట్లు, కామెడీ పంచ్ లు, సుమోలు, ఫారిన్ లొకేషన్లు, హీరోయిన్ గ్లామర్ మాత్రమే కనిపించింది. నారా రోహిత్ సినిమాల్లో ఉండే కొత్తదనం మచ్చుకైనా కనిపించలేదు.

ఇంతకుముందు చాలామంది హీరోలు వాడివదిలేసిన రొటీన్ వ్యవహారాన్ని నారా రోహిత్ ఈసారి భుజానికెత్తుకున్నాడేమో అనిపిస్తోంది. “ఈ కథకు నేనే హీరో” అంటూ ట్రయిలర్ లో నారా రోహిత్ కత్తిపట్టి ఆవేశంగా చెప్పిన ఒక్క డైలాగ్ చాలు, బాలకృష్ణుడు ఏ జానర్ కు చెందుతాడో అర్థమైపోతుంది.

ఎటొచ్చి ఈసారి కథకు కొత్తదనాన్ని ఆపాదించే బాధ్యతను నారా రోహిత్ బదులు రమ్యకృష్ణ తీసుకున్నట్టుంది. ఆమె ఎప్పీయరెన్స్ మాత్రమే ఈ సినిమా ట్రయిలర్ లో కొత్త ఎలిమెంట్.

పవన్ మల్లెల దర్శకత్వంలో రెజీనా హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 24న విడుదలకానుంది. అసలు నారా రోహిత్ ఈ సినిమా ఎందుకు ఒప్పుకున్నాడో ఆరోజు తేలిపోతుంది.