సంక్రాంతి బరిలో విశాల్ కూడా

Tamil Actor Vishal New Photos

జనవరి ఆఖరి వారంలో సూపర్ స్టార్ రజనీ 2.0 వస్తుందో, రాదో ఇంకా క్లారిటీ రాలేదు కానీ, అందుకు ముందుగా మాత్రం విడుదలకు సినిమాలు ఒకటీ ఒకటీ రెడీ అయిపోతున్నాయి. ఇప్పటికే 9న పవన్-తివిక్రమ్ ల అజ్ఞాతవాసి, సంక్రాంతికి కెఎస్ రవికుమార్-బాలకృష్ణల జై సింహా ఫిక్స్ అయిపోయాయి.

వీటికి తోడు విశాల్ నటించిన తమిళ సినిమా ఇరుంబు తెరై (ఇనుపతెర) తెలుగు వెర్షన్ ను కూడా ఈ సంక్రాంతికే విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. విశాల్ డబ్బింగ్ సినిమా అని తీసేయడానికి లేదు. ఎందుకంటే ఈ సినిమాలో తెలుగు జనాలకు సుపరిచయమైన సీనియర్ నటుడు, యాక్షన్ కింగ్ అర్జున్, తెలుగింటి కోడలు, హీరోయిన్ సమంత కూడా నటిస్తోంది.

ఈ సినిమాకు పిఎస్ మిత్రన్ అనే కొత్త దర్శకుడు పనిచేస్తున్నారు. విశాల్ తన స్వంత బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా స్వరాలు అందిస్తున్నారు. తమిళనాట పొంగల్ అన్నది సినిమాలకు కీలకమైన సీజన్. అందుకే విశాల్ తన సినిమాను అప్పుడే విడుదల చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. తమిళ వెర్షన్ తో పాటే తెలుగు వెర్షన్ ను కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

విశాల్ కు బి సి సెంటర్లలో మంచి మార్కెట్ నే వుంది. ఇదిలా వుంటే తమిళ అగ్రహీరోల్లో ఒకరైన సూర్య – డైరక్టర్ విఘ్నేష్ శివన్ ల కాంబినేషన్ లో రెడీ అవుతున్న సినిమా కూడా పొంగల్ కే విడుదలవుతోంది. ఈ సినిమా కూడా తెలుగులోకి వస్తే, ఈ సంక్రాంతి అటు స్ట్రయిట్, ఇటు డబ్బింగ్ సినిమాలతో హాట్ గా మారుతుంది.