బాహుబలి-2 కూడా ఫ్లాప్ అయింది

ప్రపంచం మొత్తం దున్నేసిన బాహుబలికి చైనా మార్కెట్ మాత్రం స్పీడ్ బ్రేకర్ లా నిలిచింది. బాహుబలి-1 సినిమా చైనాలో ఫ్లాప్ అయింది. ఇప్పుడు బాహుబలి-2 సినిమా కూడా ఫ్లాప్ దిశగా దూసుకుపోతోంది. అమీర్ నటించిన దంగల్ ను క్రాస్ చేస్తుందనుకున్న ఈ సినిమా.. రిలీజ్ కోసం పెట్టిన ఖర్చులు రాబట్టుకోవడానికి నానా హైరానా పడుతోంది.

గత వారం చైనాలో విడుదలైన ఈ సినిమా, మొదటి రోజు బాగానే మొదలుపెట్టింది. అంతా బాగుందనుకున్న టైమ్ కు రెండో రోజు నుంచే చతికిలపడడం ప్రారంభమైంది. అలా వారం తిరిగేసరికి ఈ సినిమా వసూళ్లు అటుఇటుగా 57కోట్ల రూపాయలు మాత్రమే. చైనా బాక్సాఫీస్ లో ఈ ఎమౌంట్ అంటే ఫ్లాప్ కింద లెక్క. ఈ సినిమా నుంచి ట్రేడ్ ఆశించిన మొత్తం 120కోట్లు మరి.

ఇండియాలోనే అత్యథిక వసూళ్లు సాధించిన చిత్రంగా బాహుబలి-2 నిలిచింది. భారీ బాలీవుడ్ చిత్రాల్ని సైతం తలదన్ని ఈ ఘనత సాధించింది. ఓవర్సీస్ వసూళ్లతో ప్రపంచవ్యాప్తంగా అత్యథిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా కూడా ఇది నిలబడి ఉండేది.

కానీ ఊహించని విధంగా దంగల్ సినిమా చైనాలో బ్లాక్ బస్టర్ విజయాన్నందుకుంది. దీంతో బాహుబలి-2కు ఆ ఘనత దక్కలేదు. వరల్డ్ వైడ్ అత్యథిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా దంగల్ నిలిచింది. చైనా విడుదలతో ఈ రికార్డును బాహుబలి-2 అందుకుంటుందని అంతా ఊహించారు. కానీ బాహుబలికి అది కలగానే మిగిలిపోయింది. బాహుబలి లాంటి సినిమాలు చైనీయులకు కొత్త కాదు.