భాగమతి అడ్డా థియేటర్లలో కాదు!

థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుండగానే ఎంసీఏ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లోకి వచ్చేసింది. అప్పట్లో దీనిపై కొంత వ్యతిరేకత కూడా వ్యక్తమైంది. ఇంత కక్కుర్తి అవసరమా అంటూ పరిశ్రమ పెద్దలే కొందరు కామెంట్లు చేశారు.కట్ చేస్తే.. జవాన్ సినిమా కూడా అతి స్వల్ప వ్యవథిలో అమెజాన్ లో ప్రత్యక్షమైంది. ఫ్లాప్ అయింది కాబట్టి కాసుల కోసం ఇలా చేశారనుకుందాం. కానీ ఇప్పుడు భాగమతి కూడా అడ్డా మార్చేసింది. ఇది కూడా అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చి చేరింది. ఇదే ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

జనవరి 26న థియేటర్లలోకి వచ్చింది భాగమతి. అనుష్క లీడ్ రోల్ లో చేసిన ఈ సినిమా మంచి వసూళ్లు సాధించింది. సక్సెస్ ఫుల్ వెంచర్ అనిపించుకుంది. ఇలాంటి సినిమాను ఇంత తొందరగా అమెజాన్ ప్రైమ్ లాంటి వెబ్ స్ట్రీమింగ్ వేదికలపైకి తీసుకురావాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు చాలామంది.ప్రస్తుతం థియేటర్లలో ఈ సినిమా ఆడట్లేదు కాబట్టి అమెజాన్ కు ఇస్తే తప్పేంటని కొందరు ప్రశ్నించొచ్చు. కానీ ఇది ప్రేక్షకులకు తప్పుడు సంకేతాలు అందిస్తుంది. ఎంత పెద్ద సినిమా అయినా, ఎంత హిట్ మూవీ అయినా నెల రోజుల్లో ఇలా నెట్ లో వచ్చేస్తుందనే ఆలోచన ప్రేక్షకుడికి వస్తే ఇక థియేటర్లు మూసుకోవాల్సిందే. ఎంతమంది ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు దూరమవుతారో ఈజీగానే ఊహించుకోవచ్చు.

కుటుంబంతో సినిమాకెళ్తే ఖర్చు వెయ్యి దాటిపోతోంది. అదే వెయ్యి రూపాయలు చందా కడితే ఏడాదంతా సినిమాలు చూసుకోవచ్చు. అది కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంట్లోనే. సహజంగానే ఎవరైనా రెండో ఆప్షన్ వైపే మొగ్గుచూపుతారు. ఈ ఆలోచన థియేటర్ల మనుగడకే ప్రమాదకరం.డిటిజల్ సర్వీస్ ప్రొవైడర్లతో చర్చలతో పాటు ఈ అంశం కూడా నిర్మాతల మండలి ఎజెండాలో ఉంది. కాకపోతే సర్వీస్ ప్రొవైడర్లతో లెక్కలు తేల్చిన తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ పై ఆలోచిద్దామని అంతా లైట్ తీసుకున్నారు. ఈలోగా నెలకో కొత్త సినిమా అమెజాన్ లో ప్రత్యక్షమౌతోంది.