ముగిసిన శ్రీదేవి అంత్యక్రియలు

అతిలోకసుందరి శ్రీదేవి అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో పూర్తయ్యాయి. ముంబయిలోని విలే పార్లే సమాజ్ సేవా హిందూ శ్మశాన వాటికలో శ్రీదేవి అంత్యక్రియలు నిర్వహించారు. లక్షలాది మంది ప్రజలు, అభిమానులు శ్రీదేవికి కన్నీటి వీడ్కోలు పలికారు. అర్జున్ కపూర్, అనీల్ కపూర్ తో పాటు బోనీకపూర్ కుటుంబ సభ్యులంతా ఈ అంతిమ యాత్రలో పాల్గొన్నారు.

అంతకంటే ముందు శ్రీదేవిని కడసారి చూసేందుకు, ఆమెకు నివాళులు అర్పించేందుకు భారత్ కు చెందిన దాదాపు అన్ని సినీపరిశ్రమల నుంచి ప్రముఖులు పోటెత్తారు. అంధేరి వెస్ట్ లో ఉన్న సెలబ్రేషన్స్ క్లబ్ లో ఉంచిన శ్రీదేవి పార్థిక దేహానికి నివాళులు అర్పించారు. రజనీకాంత్, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, టబు, షారూక్ ఖాన్, కత్రినాకైఫ్, జయప్రద, సుశ్మితాసేన్, అక్షయ్ కుమార్.. ఇలా చాలామంది స్టార్స్ శ్రీదేవిని కడసారి చూసేందుకు తరలివచ్చారు.

శ్రీదేవికి ఎంతో ఇష్టమైన కాంజీవరం చీరతో ఆమె భౌతిక కాయాన్ని అలంకరించారు. నుదుటిన పెద్ద బొట్టు పెట్టారు. శ్రీదేవి ఎక్కువగా ఇష్టపడే కొన్ని ప్రత్యేకమైన డిజైనరీ నగల్ని కూడా అలంకరించారు. అలా అందంగా తయారుచేసి మరీ అంత్యక్రియలు నిర్వహించారు. తన అందచందాలతో అభిమానుల్ని ఓలలాడించిన అతిలోకసుందరి, అంతే అందంగా ముస్తాబై అందర్నీ వీడి వెళ్లిపోయారు. శ్రీదేవి అంత్యక్రియలు మాత్రమే కావు.. భారతీయ సినీచరిత్రలో ఒకశకం ముగిసింది.