మంత్రికి భలే ఛాన్స్ : బాబు లేనప్పుడు సారంగో…

రాజు లేనప్పుడు సారంగో.. నువు రారాదా పోరాదా సారంగా.. అంటూ సాగే సినిమా పాట ఒకటి ఉంటుంది. ఆ తరహాలో.. అచ్చంగా.. రాకపోకల ప్రస్తావన కాదు గానీ.. అమరావతిలో బాబు లేనప్పుడు.. ఓ మంత్రి గారికి మాత్రం అరుదైన అవకాశాలు వరుసగా వచ్చి పడుతున్నాయి. చంద్రబాబునాయుడు… పది రోజుల విదేశీ యాత్రకు వెళ్లిన సంగతి అందరికీ తెలిసిందే.

ఆయన పరోక్షంలో ప్రభుత్వ వ్యవహారాలను అన్నీ తానై చూసుకోవాల్సింది ఎవరు? సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో యాక్టివ్ అయ్యే దాన్ని బట్టే నెంబర్ టూ ఎవరనే చర్చలు పార్టీల్లో జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం అలాంటి ఛాన్స్ ఏపీలో జలవనరుల మంత్రి దేవినేని ఉమాకు దక్కుతున్నట్లుగా కనిపిస్తోంది.

చంద్రబాబు తర్వాత కేబినెట్ లో నెంబర్ టూ అనే డిజిగ్నేషన్ ఎవరికీ లేదు. ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు గానీ.. వారు పెద్ద యాక్టివ్ గా రాజకీయం నడిపే నాయకులే కాకపోవడం గమనార్హం. అలాంటి నేపథ్యంలో చంద్రబాబు ఉంటే ఆయన స్వయంగా చేసే బాధ్యతలను, ఆయన లేని సమయంలో నిర్వర్తించేది ఎవరు? అనేది కీలకమైన ప్రశ్నే.

ప్రస్తుతం అలాంటి ఛాన్స్ దేవినేని ఉమాకు దక్కుతోంది. దీపావళి పర్వదినం సందర్భంగా.. నరకాసుర వధ కార్యక్రమాన్ని బెజవాడలో ఘనంగానే నిర్వహించారు. ఆ కార్యక్రమంలో నరకాసురుడి మీదకు బాణం సంధించి.. దహనం చేసేదెవ్వరు? మామూలుగా అయితే ఆ పని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసేవాళ్లు. కానీ.. ఈసారి ఆయన లేకపోవడంతో.. విల్లంబులు కాస్తా దేవినేని ఉమా చేతికి అందాయి.

ఆయనే బాణం సంధించి.. నరకాసుర వధ కావించారు. అప్పటికీ.. చంద్రబాబు పరోక్షంలో ఆయన బాధ్యతలు అన్నిటినీ మంత్రులు తలోటి కబ్జా చేసేయకుండా.. కృష్ణానదిలో హారతి కార్యక్రమానికి నారా భువనేశ్వరి తాను స్వయంగా హాజరై.. చంద్రబాబు పరోక్షంలో తానున్నానని సంకేతాలు ఇచ్చారు గానీ.. కృష్ణుడి బదులు సత్యభామ లాగా నరకాసురుడిపై బాణం వేయడానికి ఆమె రాలేదు.

అలాగే దేవినేనికి మరో ఛాన్స్ కూడా కలిసొచ్చింది. పట్టిసీమ ద్వారా కృష్ణాలోకి ఇప్పటిదాకా 80 టీఎంసీల నీళ్లు వచ్చాయి. సాధారణంగా ఇలాంటే మైలురాయి ఘటనలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా తానే ప్రకటిస్తుంటారు. తాను అందుకోసం ఎంతగా తపించిపోయిందీ ఆయన చాటుకుంటూ ఉంటారు. కానీ ఈ సందర్భంలో ఆయన లేకపోవడంతో.. దేవినేని ఉమా ఆ ఛాన్స్ వాడుకున్నారు. కాకపోతే.. 80 టీఎంసీల నీళ్లు తీసుకురావడం అనేది చంద్రబాబు కలే అంటూ.. ఆయన ఓ సేఫ్టీ డైలాగు కూడా వాడారు.

నిజానికి ఇటీవలి సమావేశంలో చంద్రబాబునాయుడు, ప్రధానంగా ఉమాకే ఎక్కువగా క్లాస్ పీకినట్లుగా ప్రచారం జరిగింది. అయితే చంద్రబాబు విదేశాలకు వెళ్లగానే.. ఆయన చేయాల్సిన బాద్యతలన్నీ అనుకోకుండా.. దేవినేని ఉమా చెంతకే వస్తున్నాయి మరి!