మసాలాగాళ్లతో నేను మాట్లాడను

కొన్నేళ్ల కిందట సిద్దార్థ్ చేసిన కామెంట్ ఇప్పుడు మరోసారి వార్తల్లోకెక్కింది. కొత్తగా ప్రయత్నిస్తే తెలుగు ప్రేక్షకులకు ఎక్కదంటూ అప్పట్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు సిద్ధూ. గృహం సినిమా విడుదల సందర్భంగా సిద్దార్థ్ కు వ్యతిరేకంగా మరోసారి ఆ వ్యాఖ్యల్ని తెరపైకి తీసుకొచ్చారు కొంతమంది. ఆ వివాదంపై కాస్త ఘాటుగానే స్పందించాడు సిద్ధూ.

“15 తెలుగు సినిమాలు చేసిన హీరోగా టాలీవుడ్ గురించి ఏమైనా మాట్లాడే హక్కు నాకుంది. నా కామెంట్స్ నచ్చకపోతే ఓకే, అది మీ అభిప్రాయం. కానీ టాలీవుడ్ పై కామెంట్ చేయడానికి సిద్దార్థ్ ఎవడని ప్రశ్నిస్తే మాత్రం చెప్పుతో కొడతా. నా ప్రేక్షకులకు నాకు మధ్య గ్యాప్ లేదు. రియాలిటీకి తగ్గట్టు సినిమాలు చేయడం లేదని మాత్రమే అప్పట్లో నేను కామెంట్ చేశాను.” అప్పటి తన వ్యాఖ్యల్లో ఎలాంటి వివాదం లేదంటున్నాడు సిద్దార్థ్.

తను హీరోగా ఉన్న టైమ్ కు ఇప్పటికీ టాలీవుడ్ చాలా డెవలప్ అయిందంటున్నాడు సిద్దార్థ్. ఇప్పటికీ టాలీవుడ్ పై తను కామెంట్స్ చేస్తుంటానని తెలిపాడు.

“నాపై విమర్శలు చేసేవాళ్లకు నేను చెప్పేది ఒకటే. నేను ఎక్కడ్నుంచి వచ్చాను, నేను ఎంత బాగా తెలుగు మాట్లాడుతున్నాను. నేను ఎలాంటి సినిమాలు చేస్తుంటాను లాంటి విషయాలు తెలుసుకొని నాతో మాట్లాడండి. అలాంటివాళ్లతోనే నేను మాట్లాడతా. మిగతా మసాలాగాళ్లతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు.”

తెలుగులో కూడా గృహం సినిమా సక్సెస్ అయినందుకు హ్యాపీగా ఉన్నాడు సిద్దార్థ్. తనను మరోసారి ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపాడు.