ముగ్గురికి ముగ్గురు

పీవీపీ, ఠాగూర్ మధు, సూర్యదేవర రాధాకృష్ణ. ముగ్గురు సినిమా అంటే చాలా ఇష్టపడేవారు, డైరక్టర్లకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి, వాళ్ల ఇష్టానికి వదిలి సినిమా చేసేవారు. ఇలా కాదు అలా అని పొరపాటున కూడా అనేరకం కాదు ఈ ముగ్గురూ. డైరక్టర్ ఏం తీస్తున్నారో? ఏం చేస్తున్నారో? అన్నది ఆచూకీ తీయకుండా డబ్బులు పెడుతూ వెళ్తారు. కానీ ముగ్గురికీ ముగ్గురు డైరక్టర్లు అన్యాయమే చేసారు.

పీవీపీ తన బ్రహ్మోత్సవం సినిమాను లావిష్ గా తీసారు. తెరనిండా యాక్టర్లు, భారీ సెట్టింగ్ లు, దేశం అంతటా చిత్రీకరణ. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఏది అంటే అది సమకూర్చారు. సినిమా తీసారు. నిర్మాతగా కోలుకోలేని దెబ్బతిన్నారు.ఠాగూర్ మధు దర్శకుడు మురుగదాస్ ను నమ్మారు. అంతకు ముందు శ్రీనువైట్లను కూడా నమ్మారు అది వేరే సంగతి. మురుగదాస్ దాదాపు 110కోట్లు ఖర్చు చేయించారు. ఓ అర్థం పర్థం లేని సినిమా తీసి చేతిలో పెట్టారు. స్పైడర్ దెబ్బ అన్నది ఠాగూర్ మధుకు ఇలాంటిది అలాంటిది కాదు.

ఇక సూర్యదేవర రాధాకృష్ణ అనగానే మంచి నిర్మాత అన్నది తప్ప మరో కామెంట్ ఇండస్ట్రీలో వినిపించదు. ఆయన మొత్తం వ్యవహారాలను ప్రొడక్షన్ టీమ్ కు అప్పగించి, దర్శకుడు త్రివిక్రమ్ ను నమ్మి, నిబ్బరంగా వుంటారు. అలాంటి నిర్మాత చేత అవసరంలేని కథకు 130కోట్ల వరకు ఖర్చు చేయించేసారు దర్శకుడు త్రివిక్రమ్. పైగా తాను ఖర్చు మనిషి అని పబ్లిక్ గా చెప్పుకున్నారు. ఇప్పుడేమయింది. నిర్మాతగా ఆయనకు ఓ మచ్చ మిగిలిపోయింది.

ఒక విధంగా డైరక్టర్లు మితిమీరిన ఆత్మవిశ్వాసం అనాలో, ధీమా అనాలో. ఇంకేమైనా అనాలో కానీ నిర్మాతలను మింగేస్తున్నారు.