మూలిగే నక్కపై చంద్రబాబు తాటిపండు!

చంద్రబాబునాయుడు తాజాగా తీసుకున్న నిర్ణయం మూలిగే నక్కపై తాటిపండు వేసే చందంగా కనిపిస్తోంది. పోలవరం ప్రాజెక్టు పనుల్ని సత్వరం ఒక కొలిక్కి తీసుకురావడం, కాఫర్ డ్యాం పనులు ప్రారంభం అయ్యేల చూడడం అనే ముసుగులో ఆయన రాష్ట్ర ఖజానాపై వెయ్యికోట్ల రూపాయల అదనపు భారం వేయడానికి సిద్ధం అవుతున్నారు. ఈ వ్యవహారం మూలిగే నక్కపై తాటిపండు చందంగానే మారబోతున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

నిర్మాణం త్వరగా జరగడానికి కొన్ని కీలక పనులకు కొత్తగా టెండర్లు పిలవడం, లేదా, కొత్త సబ్ కాంట్రాక్టర్లకు పనులు నేరుగా అప్పగించండం అనే తరహాలో ఈ అదనపు భారాన్ని మోపబోతున్నారు. ఈ వ్యహారం మొత్తం రాష్ట్ర ఖజానాకు అదనపు భారంగా తయారవుతుంది. పోలవరం ప్రాజెక్టు విషయంలో నిబంధనల ప్రకారం.. కాంట్రాక్టరుతోనే అన్ని పనులు పూర్తిచేయించేలా చూడాలే తప్ప.. ఈ దశలో టెండర్లు రద్దుచేసి.. కొత్తగా టెండర్లు పిలిచి దాదాపు 25శాతం అదనపు భారాన్ని భరించడానికి తాము సిద్ధంగాలేమని .. కేంద్రం గత సమావేశంలోనే చేతులెత్తేసింది.

చంద్రబాబునాయుడు ఎన్నిరకాలుగా వారిని కన్విన్స్ చేయడానికి చూసినా.. ఫలితం దక్కలేదు. పైగా.. అదనంగా పడగల ఆర్థిక భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించేట్లయితే గనుక.. తమకు ఎలాంటి అభ్యంతరమూ లేదని కేంద్రం మరో వెసులుబాటు కూడా ఇచ్చింది. అసలే ఆర్థిక సమస్యలతో కుదేలవుతున్న రాష్ట్రం.. ఈ విషయంలో మరో భారానికి సిద్ధపడడం అసాధ్యం అనే ఉద్దేశంతోనే కేంద్రం అలా చెప్పినట్లుగా కూడా స్పష్టంగానే కనిపిస్తోంది.

అయితే తాను పట్టిన కుందేలికి మూడేకాళ్లు అనడంలో సిద్ధహస్తుడైన చంద్రబాబునాయుడు తాను చెప్పినట్లుగా కొత్త టెండర్లు పిలిస్తే తప్ప ఊరుకునేలా లేరు. తనకు అంత పట్టుదల ఉంటే, తన ఇమేజిని ఉపయోగించి.. కేంద్రాన్ని ఒప్పించి సాధించాల్సింది బదులుగా, ఆ భారాన్ని రాష్ట్రం మీదే మోపడానికి మళ్లీ ఆయన సిద్ధం అవుతున్నారు. ఈ నిర్ణయం పట్ల పలువురిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇప్పటికీ.. కొత్తగా అప్పగించదలచుకుంటున్న పనులను ట్రాన్స్ ట్రాయ్ నుంచి తప్పించడానికి ఉన్న ఒప్పందంలోని నిబంధనలను చంద్రబాబు ప్రస్తావిస్తున్నారే తప్ప, పనుల్లో జాప్యం అయినందుకు వారినుంచి నష్టపరిహారం వసూలు చేసే నిబంధనల గురించి మాట్లాడడం లేదు. 3వ తేదీ ఢిల్లీ వెళ్లినప్పుడైనా, ఈ అదనపు భారం భరించడానికి కేంద్రాన్ని చంద్రబాబు ఒప్పిస్తే మంచిదేనని, అలా చేయలేకపోతే రాష్ట్రానికి నష్టం తప్పదని పలువురు అంటున్నారు.