అందరూ జగన్ కు నీతులు చెప్పేవాళ్లే!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న తెలుగుదేశం ప్రభుత్వ తీరును ఎండగట్టడానికి, తమ పార్టీ సభ్యులెవరూ అసలు శాసనసభకే వెళ్లరాదని ఆయన నిర్ణయించారు. తమను గెలిపించింది ప్రజలు గనుక.. తమ నిర్ణయానికి ప్రజలకు జవాబు చెప్పుకునే ఉద్దేశంతోనే వైఎస్సార్ కాంగ్రెస్ ఉన్నది.

నిర్ణయాత్మకం కాని మొక్కుబడి అసెంబ్లీ సమావేశాల్లో ఉండడం కంటె తమను గెలిపించిన ప్రజల మధ్య ఉండడం వల్లనే వారికి ఎక్కువ పనిచేసినట్లు అవుతుందనే ఉద్దేశంతో.. పార్టీ ఎమ్మెల్యేలకు పల్లెనిద్ర వంటి కార్యక్రమాల్ని జగన్ నిర్దేశించారు. అయితే ఇప్పుడు తమాషా ఏంటంటే.. వైఎస్సార్ కాంగ్రెస్ మినహా ఏపీలోని మిగిలిన ప్రతిపక్షాల నాయకులు అందరూ జగన్ కు నీతులు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు.

2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా స్పష్టమైన తీర్పు వచ్చింది. అయితే చంద్రబాబు లేదా జగన్ అన్నట్లుగా మాత్రమే జనం ఓట్లేశారు. ఆ దెబ్బకు మిగిలిన ఏ పార్టీకి కూడా అసెంబ్లీలో ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. అయితే పార్టీలుగా తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడం వారి విధి గనుక.. కాంగ్రెస్ గానీ, వామపక్షాలు గానీ తమ పాట్లు తాము పడుతున్నాయి.

కాంగ్రెస్ పార్టీ.. రాష్ట్ర విభజన తర్వాత.. శవాసనం వేసినా.. ఆ పార్టీని ప్రజలెవ్వరూ పట్టించుకోకపోయినా.. మిగిలి ఉన్న నాయకులు మాత్రం.. అడపాదడపా చిన్న ఉద్యమాల పేరిట ప్రజల్లో తిరుగుతూ.. హడావిడి చేస్తుంటారు. సీపీఐ తమ సహజశైలిలో అనేక ప్రజాఉద్యమాలు చేస్తూనే ఉంది. ప్రభుత్వాన్ని కొన్ని కీలక ప్రజావ్యతిరేక నిర్ణయాల విషయంలో అడ్డుకోడానికి ప్రయత్నిస్తూనే ఉంది.

అయితే ఇప్పుడు ఈ పార్టీల నాయకులు జగన్ నిర్ణయాన్ని తప్పు పడుతున్నారు. అసెంబ్లీకి హాజరు కాకుండా ఉండాలనే నిర్ణయం సరికాదని, జగన్ తన నిర్ణయాన్ని సమీక్షించుకోవాలని వారు సూచిస్తున్నారు. సభలో ఉన్న ఒకే ఒక ప్రతిపక్షం అసలు సభకే వెళ్లకుండా మిన్నకుండిపోతే.. పాలకపక్షం ఇష్టారాజ్యంగా చెలరేగుతుందనేది వారి భయంగా ఉంది. అందుకే సీపీఐ రామకృష్ణ- జగన్ తన నిర్ణయాన్ని పునస్సమీక్షించుకోవాలని కోరుతున్నారు.

ఆయనైతే ఏకంగా జగన్ తన పాదయాత్రనే వాయిదా వేసుకోవాలని అంటున్నారు. పాదయాత్ర అసెంబ్లీని మించిన అర్జంటు పనికాదని వ్యాఖ్యానిస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రఘువీరారెడ్డి కూడా ఇంతకంటె నిశితంగా జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. అసెంబ్లీకి వెళ్లకూడదన్న జగన్ నిర్ణయం.. తెలివి తక్కువ పని అని ఆయన అంటున్నారు.

జగన్ పార్టీ మాత్రం.. ఒకసారి తాము డిసైడ్ చేసిన తర్వాత.. ఇక మా మాట మేమే వినం.. అనే ధోరణిలోనే వ్యవహరిస్తోంది. కాకపోతే.. అసెంబ్లీకి బదులుగా ప్రజల మధ్యలో గడపాలనే నిర్ణయం తమకు మేలు చేస్తుందని వారు నమ్ముతున్నారు. సభలో తమకు ప్రవేశం కూడా అవకాశం లేని ప్రతిపక్షపార్టీలు అన్నీ, జగన్మోహన్ రెడ్డికి నీతులు చెప్పడం చిత్రంగా ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.