మెంటల్ మదిలో.. పంట పండినట్లేనా?

పెళ్లి చూపులు సినిమాతో హిట్ కొట్టాడు నిర్మాత రాజ్ కందుకూరి. ఆ తరువాత సోలోగా ఆయనే పూర్తిగా నిర్మాతగా మెంటల్ మదిలో అనే కొత్త సినిమాను స్టార్ట్ చేసాడు. ఏ నిర్ణయం వెంటనే తీసుకోలేక, శ్రీశ్రీ చెప్పినట్లు, అటు చూస్తే బాదం హల్వా, ఇటు చూస్తే సేమ్యా ఇడ్లీ అంటూ కిందా మీదా పడే హీరో ను క్యారెక్టర్ కాన్సెప్ట్ గా తీసుకుని, మళ్లీ కొత్త డైరక్టర్ కు చాన్స్ ఇచ్చి సినిమా తయారుచేసారు. వివేక్ ఆత్రేయ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతో పరిచయం అవుతున్నాడు.

పెళ్లిచూపులు విడుదలయిన తరువాత డబ్బులు ఇస్తే, ఈ సినిమా విడుదలకు ముందే డబ్బులు ఇచ్చేసినట్లు తెలిసింది. అదెలా అంటే, ఈ సినిమా నిర్మాణానికి దగ్గర దగ్గర రెండు కోట్లు ఖర్చుచేసారు. ఆ రెండు కోట్లు కూడా దగ్గుబాటి సురేష్ బాబు అందించారని తెలుస్తోంది. అదెందుకు అంటే, సినిమాలో ఆ విధంగా ఆయన ఫిఫ్టీ పర్సంట్ బాగస్వామిగా మారారు. సినిమా విడుదలయ్యాక, రెండు కోట్లు వెనక్కు తీసేసి, మిగిలిన ప్రతి దాంట్లో సురేష్ బాబు, రాజ్ కందుకూరి ఫిఫ్టీ.. ఫిఫ్టీ అన్నమాట.

ఇలాంటి టైమ్ లో డిజిటల్ రైట్స్ కొనడంలో స్పీడ్ గా వున్న అమెజాన్ రంగప్రవేశం చేసింది. కోటిన్నరకు కాస్త అటు ఇటుగా ఈ సినిమా డిజిటల్ రైట్స్ తీసేసుకుంది. ఇంక హీందీ డిజిటల్ వుండనే వుంది. అంటే థియేటర్ రైట్స్ సురేష్ బాబుకు, రాజ్ కందుకూరికి డే వన్ నుంచి ప్రాఫిట్స్ పంచుతాయన్నమాట. ఇప్పుడిప్పుడే సినిమాలు చేస్తున్న శ్రీవిష్ణు ఈ సినిమాలో హీరో. ఈ సినిమాతో తన కెరీర్ ఊపందుకుంటుందని చాలా ఆశగా వున్నాడు శ్రీవిష్ణు.