మ్యాగ్ జైన్ సెక్షన్ కు రామోజీ బై బై?

ఉన్నట్లుండి మీడియా సర్కిళ్లలో ఈ వైనం వినిపిస్తోంది. ఈనాడు గ్రూపు సంస్థల్లో కీలకమైన మ్యాగ్ జైన్ సెక్షన్లు ఇక డిజిటల్ వెర్షన్ కే పరిమితం అవుతాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. రామోజీరావు మానస పుత్రికలయిన చతుర, విపుల, సితార మ్యాగ్ జైన్లు ఇంక భవిష్యత్ లో ఇంటర్ నెట్ ఎడిషన్లు మాత్రమే వుంటాయని, ప్రింట్ ఎడిషన్లు వుండవని టాక్ వినిపిస్తోంది.

సాధారణంగా ఒక వెంచర్ స్టార్ట్ చేసిన తరువాత వెనుక అడుగువేయడం అన్నది రామోజీరావుకు తెలియదు. ఓపిగ్గా భరించి, దాన్ని విజయతీరాలకు చేరుస్తారు ఆయన. న్యూస్ టుడే ఇంగ్లీష్ డైలీని చాలాకాలం అలాగే కొనసాగించి ఆఖరికి తీసేసారు. చాలాకాలం ముందుగా, జనాలకు పళ్లరసాల మీద అభిరుచి ఏర్పడని కాలంలో, రెండుమూడు దశాబ్ధాలు ముందుగా ఆలోచించి, సోమ ప్యాక్ డ్ పళ్ల రసాలు స్టార్ట్ చేసారు. ఈ కాలంలో అయితే హిట్ అయ్యేదేమో. అప్పట్లో సక్సెస్ సాధించలేకపోయారు. ఇప్పుడు అందరికీ ప్యాక్డ్ పళ్లరసాలు అలవాటు పడ్డాయి. కానీ అప్పట్లో కాబట్టి, రామోజీ ఆ వెంచర్ కూడా క్లోజ్ చేసారు.

కాలం మారుతోంది. ప్రింట్ ఎడిషన్లకు ముఖ్యంగా మ్యాగ్ జైన్లకు అంతగా ఆదరణ వుండడంలేదు. ఇండియాటుడే లాంటి సంస్థనే తన వీక్లీని తెలుగులో ఆపేసింది. ఆంధ్రభూమి వీక్లీ కొనఊపిరితో వుంది. ఆంధ్రజ్యోతి అండతో నవ్య నడుస్తోంది. స్వాతి ఇంకా మార్కెట్ లీడర్ గా వుంది. సినిమా పత్రికలకు కాలం చెల్లిపోయింది. జ్యోతిచిత్ర, శివరంజని లాంటివి ఇప్పుడు కనుమరుగైపోయాయి. డైలీ పత్రికలు ఫుల్ పేజీ సినిమా న్యూస్ ఇస్తుంటే, డైలీ టీవీల్లో సినిమా న్యూస్ ఇస్తుంటే వారం తరువాత వచ్చే సినిమా పత్రికలు చదవడం తగ్గిపోయింది. అయినా సితారను అలా నిర్వహిస్తున్నారు.

ఇక చతర(నవల), విపుల(కథలు) నెలకు ఓసారి వస్తున్నాయి. కానీ వాటి సర్క్యలేషన్ కూడా తక్కువే అని వినికిడి. పైగా స్మార్ట్ ఫోన్ లు వచ్చాక, ఇంటర్ నెట్ వినియోగం పెరిగాక, నెట్ ఎడిషన్లకు డిమాండ్ పెరుగుతోంది. అందుకే ఈనాడు గ్రూప్ లో ఈ మూడు మ్యాగ్ జైన్లను నెట్ ఎడిషన్లకే పరిమితం చేయాలన్న డిస్కషన్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

వాస్తవానికి సితార, చతుర, విపుల ఈ మూడూ అంటే రామోజీకి చాలా అభిమానం. ఆయన వరకు వీటి ప్రింట్ ఎడిషన్లు ఆపేయడానికి ఇష్టపడడం లేదని తెలుస్తోంది. కానీ లెక్కలు, మారుతున్న పాఠకుల వైఖరి ఇవన్నీ వివరించి ఆయనను కూడా ఒప్పించినట్లు తెలుస్తోంది. మరి ఈ నిర్ణయం ఎప్పటికి కార్యరూపం దాలుస్తుందో అన్నది తెలియదు.

సిబ్బంది వుంటారు. ఎడిషన్ రెడీ చేసి, నెట్ లో అప్ లోడ్ చేస్తారు. కానీ మార్కెట్ లో మాత్రం వుండవు. ఇదీ మీడియా సర్కిళ్లలో వినిపిస్తున్న మాట. ఎంతవరకు నిజం అన్నది కాలమే తేల్చుతుంది.