మూడు సినిమాలు-అసలు లెక్కలు

సినిమా ఇండస్ట్రీలో అమ్మడం కోసం భలే కబుర్లు చెబుతుంటారు. ఇంత ఖర్చయింది..అంత ఖర్చయింది అని. అలా అనకపోతే బిజినెస్ దగ్గర సమస్య వస్తుంది. పైగా భారీఖర్చు అంటే జనాల్లో సినిమాకు వచ్చే బజ్ వేరు. అందుకే అలా చెబుతారు. అలాగే వార్తలు వస్తాయి. ఈ వారం విడుదలైన మూడు సినిమాల అసలు బడ్జెట్ ల లెక్కలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి.

రాజశేఖర్ నటించిన గరుడవేగ సినిమాకు భారీగా ఖర్చు చేసారని, 35కోట్ల వరకు ఖర్చయిందని వార్తలు వచ్చాయి. నిజానికి ఈ సినిమాకు కాస్త భారీగా ఖర్చుచేసిన మాట వాస్తవమే, సినిమా ప్రారంభంలో వచ్చే బైక్ ఛేజింగ్ కు, క్లయిమాక్స్ లో వచ్చే షిప్ బ్లాస్టింగ్ కోసం భారీగా ఖర్చు చేసిన మాట వాస్తవమే. కానీ నిజానికి మొత్తం సినిమాకు, వడ్డీలు, పెట్టుబడి, పబ్లిసిటీ అన్నీ కలిపి 17కోట్ల వరకు ఖర్చయిందని తెలుస్తోంది.

శాటిలైట్, హిందీ డిజిటల్, అన్నీ కలిపి అయిదారు కోట్ల వరకు వస్తాయని ధీమాగా వున్నారు. మూడు ఏరియాల్లో థియేటర్ వసూళ్లను బట్టి సేఫ్ అన్నది ఆధారపడుతుంది. ఇక ముఫైకోట్లు ఖర్చయిందని హడావుడి జరిగిన నాగ్ అన్వేష్ సినిమాకు అయిన వాస్తవ ఖర్చు అయిదుకోట్లు మాత్రమేనట. ఇందులో సింహభాగం అంటే గ్రాఫిక్స్ కు చేసిన ఖర్చు కోటి రూపాయలు. హెబ్బాపటేల్ కు ఇచ్చింది పాతిక లక్షలు, కమెడియన్ సప్తగిరికి ఇచ్చింది ఇరవైలక్షలు. ఇంక మిగిలిన స్టార్ కాస్ట్ అంతంత మాత్రమే.

పబ్లిసిటీకి మాత్రం భాగానే ఖర్చుచేసారు. అదికాస్త అదనం. హిందీ డిజిటల్ 1.40 కోట్లకు ఇచ్చారు. శాటిలైట్ కావాలి. కోన్ని ఏరియాలు అమ్మడం ద్వారా మరి కొంత వచ్చింది. శాటిలైట్ ఏమేరకు అవుతుందనే దాన్ని బట్టి లాభం నష్టం వుంటుంది. గీతాసంస్థ బ్యాకింగ్ తో నిర్మించిన నెక్స్ట్ నువ్వే సినిమాకు అయిదుకోట్ల వరకు ఖర్చయింది. నిజానికి ఇది చిన్న సినిమాలా కనిపిస్తుంది. అన్నింటికన్నా ఖర్చు తక్కువ దీనికే అనిపిస్తుంది.

కానీ రీమేక్ రైట్స్, సెట్ ఇతరత్రా వ్యవహారాలు అన్నీకలిపి అయిదుకు చేరిపోయింది. శాటిలైట్ ముందే అయిపోవడం ఈ సినిమాకు ప్లస్. రెండున్నర కోట్ల వరకు శాటిలైట్ చేసుకోగలిగారు. రెండు మూడు ఏరియాలు అమ్మడం ద్వారా అరకోటి వచ్చింది. దాంతో మూడుకోట్లు రికవరీ అయిపోయింది. మాగ్జిమమ్ ఏరియాలు ఓన్ డిస్ట్రిబ్యూషన్ నే. అందువల్ల రెండుకోట్లు అక్కడ రికవరీ కావాలి.