‘రంగస్థలం’లో డ్యాన్సుల మోతే…

‘రంగస్థలం’ సినిమా నుంచి ఆల్రెడీ రెండు పాటలు విన్నాం. ఇప్పుడు ఫుల్ ఆడియో బయటికి వచ్చేసింది. మిగతా రెండు పాటలు కూడా జనాల్లోకి వెళ్లిపోయాయి. మొత్తంగా ఈ ఆడియో చూస్తే సినిమా థీమ్‌కు తగ్గట్లే ఊపు మీద సాగేట్లు అనిపిస్తోంది. సినిమాలో ఇంకో సర్ప్రైజ్ సాంగ్ కూడా ఉందంటున్నారు కానీ.. దాని సంగతేంటో నేరుగా సినిమా చూసే తెలుసుకోవాలి.

ఇప్పటికి బయటికి వచ్చిన ఐదు పాటల్లో మూడు పాటలు జనాల్ని ఊగిపోయేలా చేసేవే. ‘ఎంత సక్కగున్నావే’ సినిమాలో ఉన్న పూర్తి స్థాయి మెలోడీ. ‘రంగమ్మా మంగమ్మా’ కూడా కొంచెం నెమ్మదిగా సాగే పాటే. ఈ పాటలో సమంత ఎలా డ్యాన్స్ చేస్తుందో.. ఎలాంటి హావభావాలిస్తుందో అని జనాలు ఎదురు చూస్తున్నారు.

ఇక మిగతా మూడు పాటలు మాత్రం మాస్ జనాలకు.. డ్యాన్స్ ప్రియులకు విందు భోజనం అయ్యేలాగే కనిపిస్తున్నాయి. రంగా రంగా రంగస్థలాన అంటూ సాగే టైటిల్ సాంగ్‌లో దేవిశ్రీ ప్రసాద్ డప్పులతో మోత మోగించేశాడు. ఈ పాటలో డ్యాన్సుల మోత మామూలుగా ఉండదనిపిస్తోంది. మాంచి నాటు సాంగ్ కావడంతో థియేటర్లు హోరెత్తిపోయే అవకాశముంది. రామ్ చరణ్ స్వతహాగా మంచి డ్యాన్సర్ కాబట్టి డ్యాన్సులు అదిరిపోయే అవకాశముంది. ఇంకా జిగేల్ రాణి ట్యూన్ అంత శ్రావ్యంగా, క్యాచీగా లేదు కానీ.. ఇందులోనూ డ్యాన్సులకు కొదవ ఉండేలా లేదు. ఈ పాటలో చరణ్ డ్యాన్సుల గురించి ఆల్రెడీ పూజా హెగ్డే హింట్లిచ్చింది. వీళ్లిద్దరి కాంబినేషన్లో ఈ పాట చాలా బాగుండొచ్చని లిరికల్ సాంగ్‌లో ఉన్న కొన్ని డ్యాన్స్ మూమెంట్స్ చూస్తుంటే అర్థమవుతోంది.

అలాగే ఆ గట్టునుంటావో అంటూ సాగే పాటలోనూ మంచి బీట్ వినిపిస్తోంది. ఇందులోనూ నాటు డ్యాన్సులు ఆకట్టుకోవచ్చు. మొత్తంగా చూస్తే ‘రంగస్థలం’లో డ్యాన్సులకైతే ఢోకా ఉండదనిపిస్తోంది.