రంగస్థలం బాటలో మహానటి

రెండున్నర గంటల నిడివి నుంచి క్రమంగా తెలుగు సినిమా మళ్లీ 3గంటల ఫార్మాట్ లోకి వెళ్లిపోతోందేమో అనిపిస్తోంది. బడా సినిమాలన్నీ ఇప్పుడు భారీ రన్ టైమ్ తో వస్తున్నాయి. తాజాగా ఈ లిస్ట్ లోకి మహానటి సినిమా కూడా చేరిపోయింది. ఈ సినిమా డ్యూరేషన్ కూడా 3గంటలుంది. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే 2గంటల 56నిమిషాలుంది.

నిజానికి మహానటి సినిమాకు ఈ డ్యూరేషన్ తక్కువే అని చెప్పాలి. సావిత్రి జీవితాన్ని వెబ్ సిరీస్ గా తీస్తే.. గంట నిడివి చొప్పున 6-7 ఎపిసోడ్స్ తీయొచ్చని చెప్పుకొచ్చాడు దర్శకుడు నాగ్ అశ్విన్. అలాంటిది మొత్తం జీవితాన్ని ఒకే సినిమాలో చూపించాలంటే ఈ మాత్రం నిడివి తప్పదంటున్నాడు.

సినిమా మొత్తం 3గంటల 45నిమిషాలు వచ్చిందని, అతికష్టం మీద ట్రిమ్ చేసి 2గంటల 56నిమిషాలకు కుదించామని చెబుతున్నాడు. సినిమాలో ఎక్కడా ఎమోషన్ మిస్ అవ్వదని, ఒక ఫ్లోలో అలా సాగిపోతుందని చెబుతున్నాడు. సమంత పాత్ర ద్వారా చెప్పించిన క్లయిమాక్స్ టోటల్ సినిమాకే హైలెట్ అంటున్నాడు.

అర్జున్ రెడ్డి, రంగస్థలం, భరత్ అనే నేను సినిమాలు కాస్త ఎక్కువ రన్ టైమ్ తోనే వచ్చాయి. అయినప్పటికీ అవి హిట్ అయ్యాయి. ఇప్పుడు మహానటి కూడా అటుఇటుగా 3గంటల రన్ టైమ్ తో వస్తోంది. చూద్దాం.. ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో!