రచ్చకెక్కిన ‘శ్రీనాగ్‌’ అసలేమయ్యింది.!

శ్రీనివాసరావు పేరులోని ‘శ్రీ’, నాగ సుశీల పేరులోని ‘నాగ్‌’ కలిసి ‘శ్రీనాగ్‌ కార్పొరేషన్‌’ పేరుతో ఓ సినీ నిర్మాణ సంస్థ ప్రారంభమయ్యింది. ఇది చాలాకాలం క్రిందటి మాట. నాగార్జున సోదరి నాగ సుశీల తన కుమారుడు సుశాంత్‌ని హీరోగా పెట్టి ఈ బ్యానర్‌లో సినిమాలు నిర్మించారు. చింతలపూడి శ్రీనివాసరావు నేతృత్వంలో సుశాంత్‌ హీరోగా పలు సినిమాలొచ్చాయి ‘శ్రీనాగ్‌ కార్పొరేషన్‌’ బ్యానర్‌లో.

‘కాళిదాసు’, ‘కరెంట్‌’, ‘అడ్డా’, ‘ఆటాడుకుందాం రా’ తదితర సినిమాలు ఇదే శ్రీ నాగ్‌ కార్పొరేషన్‌ బ్యానర్‌లో రూపొందిన విషయం విదితమే. వీటిల్లో ‘ఆటాడుకుందాం రా’ పరాజయం తర్వాత ‘శ్రీనాగ్‌ కార్పొరేషన్‌’లో అంతర్గత గొడవలు షురూ అయ్యాయి. ఓ దశలో నాగార్జున కల్పించుకుని ఇటు నాగ సుశీలకీ, అటు చింతలపూడి శ్రీనివాసరావుకీ మధ్య ‘రాజీ’ కుదిర్చినట్లు అప్పట్లో ప్రచారం జరిగిన విషయం విదితమే.

ఇప్పుడేమో, నాగసుశీల తనకు చెందిన కొన్ని ఆస్తుల్ని శ్రీనివాసరావు అక్రమంగా కాజేశారని పోలీసుల్ని ఆశ్రయించారు. మరోపక్క, చింతలపూడి శ్రీనివాసరావు అదంతా అబద్ధమని కొట్టి పారేస్తున్నారు. ‘నాగ సుశీల పెద్ద మొత్తంలో నాకు బకాయిపడ్డారు. అడిగితే, పెద్ద కుటుంబంతో పెట్టుకుంటున్నావంటూ హెచ్చరించారు. ఇప్పుడేమో ఇలా అక్రమ కేసులు బనాయించే ప్రయత్నం చేస్తున్నారు..’ అంటూ ఆరోపిస్తున్నారు.

ఇప్పుడీ వ్యవహారం టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. వసూళ్ళ పరంగా సుశాంత్‌ సినిమాలు నిరాశపరుస్తున్నా, చాలా రిచ్‌గా అతని సినిమాలు రూపొందుతూ అందర్నీ షాక్‌కి గురిచేశాయి. ఇప్పుడేమో, ఆ నిర్మాణ సంస్థ ఇదిగో, ఇలా అంతర్గత కుమ్ములాటలతో వార్తల్లోకెక్కింది. ఇంతకీ, ఈ వ్యవహారంలో తప్పెవరిది.? తెరవెనుకాల ఏం జరిగింది.? పోలీస్‌ స్టేషన్‌ మెట్లెక్కిన ఈ కేసులో ‘వాస్తవాలు’ ఎప్పటికి బయటకొస్తాయో ఏమో.!