‘పద్మావతి’ – అసలేమవుతోంది.!

దీపికా పడుకొనే, షాహిద్‌కపూర్‌, రణ్‌వీర్‌సింగ్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘పద్మావతి’ సినిమా వివాదాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తెరవెనుక, సినిమా విడుదల వాయిదా ప్రయత్నాల్లో బిజీగా వున్న ‘పద్మావతి’ టీమ్‌, పైకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్‌ 1న విడుదల చేసి తీరతామని చెబుతోంది.

ఇక, తాజాగా ఈ సినిమా సెన్సార్‌ బోర్డ్‌ ముందుకు వెళ్ళింది. కానీ, వెనక్కి వచ్చింది. కారణం, సెన్సార్‌ కోసం అప్లయ్‌ చేసుకుంటూ, ‘పద్మావతి’ టీమ్‌ సెన్సార్‌ బోర్డ్‌కి ఇచ్చిన అప్లికేషన్‌లో కొన్ని ‘కాలమ్స్‌’ని ‘ఖాళీ’గా వుంచెయ్యడమే. అసంపూర్తిగా వున్న అప్లికేషన్‌తో సెన్సార్‌ పూర్తి చేయలేమని సెన్సార్‌ బోర్డ్‌ తేల్చి చెప్పింది. దాంతో, ‘పద్మావతి’ టీమ్‌కి షాక్‌ తగిలిందనే ప్రచారం జరుగుతోంది.

అయితే, ‘పద్మావతి’ టీమ్‌ మాత్రం, ‘చాలా చిన్న టెక్నికల్‌ విషయమది..’ అంటూ కవరింగ్‌ డైలాగ్‌ పేల్చింది. ‘సినిమా సెన్సార్‌ వద్దకు వెళ్ళింది.. అక్కడే వుంది.. సెన్సార్‌ అయిపోతుంది..’ అని ‘పద్మావతి’ టీమ్‌ నుంచి మీడియాకి సమాచారం అందుతోంది. కానీ, రాజ్‌పుత్‌ కర్ణిసేన మాత్రం ‘పద్మావతి’ సినిమాని ఎట్టి పరిస్థితుల్లోనూ విడుదల కానివ్వబోమనీ, సెన్సార్‌ కంటే ముందుగానే ఆ సినిమాని తమకు చూపించాలని, లేకపోతే దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీతోపాటు, హీరోయిన్‌ దీపికా పడుకొనేపైనా, చివరికి థియేటర్లపైనా దాడులకు పాల్పడతామని హెచ్చరిస్తోంది.

ఇంతకీ, ‘పద్మావతి’ సెన్సార్‌ అవుతుందా.? అయితే, ఆ తర్వాతయినా కర్ణిసేనకు సినిమాని చూపిస్తారా.? ఆ తర్వాత మళ్ళీ సినిమా ఇంకోసారి సెన్సార్‌కి వెళ్తుందా.? ఎటూ, వెనక్కి వచ్చింది గనుక కర్ణిసేనకు సినిమా చూపించిన తర్వాతే సెన్సార్‌కి పంపుతారా.? అన్నిటికీ మించి, ఈ సినిమా డిసెంబర్‌ 1న విడుదలవుతుందా.? లేదా.? ఇవన్నీ ప్రస్తుతానికైతే మిలియన్‌ డాలర్‌ ప్రశ్నలే.