రాజమౌళి అమరావతి ఎలా వుంటుందో.!

లండన్‌లో నార్మన్‌ ఫోస్టర్స్‌ సంస్థ ప్రతినిథులతో సినీ దర్శకుడు రాజమౌళి భేటీ అయ్యారు. ఈ సందర్బంగా రాజధాని అమరావతి కోసం నార్మన్‌ ఫోస్టర్స్‌ సంస్థ తయారు చేసిన డిజైన్లలో చిన్న చిన్న సవరణల్ని దర్శకుడు రాజమౌళి సూచించారట. రాజమౌళితోపాటు, మంత్రి నారాయణ, పలువురు సీఆర్డీయే అధికారులు నార్మన్‌ ఫోస్టర్స్‌ సంస్థ ప్రతినిథుల్ని కలిసిన బృందంలో వున్నారు.

నిజానికి నార్మన్‌ ఫోస్టర్స్‌ సంస్థ గతంలోనే కొన్ని డిజైన్లు రూపొందించింది. అయితే, ఆ డిజైన్లు ముఖ్యమంత్రి చంద్రబాబుని మెప్పించలేకపోయాయి. తన ఆలోచనలకు తగ్గట్టుగా ఆ డిజైన్లు లేవని ఆక్షిపిస్తూ, కొత్త డిజైన్లు తయారు చేయాల్సిందిగా నార్మన్‌ ఫోస్టర్స్‌ సంస్థకి సూచించారు చంద్రబాబు. మరోపక్క, తన ఆలోచనలకు తగ్గట్టుగా నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థకు సూచనలు చేయాలంటూ, దర్శకుడు రాజమౌళిని సంప్రదించారు చంద్రబాబు. ఈ నేపథ్యంలో పలువురు మంత్రులు, రాజమౌళిని ఒప్పించారు కూడా.

ఈ వ్యవహారపై పెద్ద రాజకీయ దుమారమే చెలరేగింది. ఆంధ్రప్రదేశ్‌లో బోల్డంతమంది ఆర్కిటెక్టులు వుండగా, సినీ దర్శకుడు రాజమౌళితో అమరావతి డిజైన్లు ఖరారు చేయించడమేంటన్న విమర్శలు వెల్లువెత్తాయి. చంద్రబాబు మాత్రం, తన ఆలోచనలకు దగ్గరగా రాజమౌళి ఆలోచనలు వుంటాయన్న కోణంలో రాజమౌళిని ప్రత్యేకంగా అమరావతి కోసం పిలిపించారు.

అంతా బాగానే వుందిగానీ, రాజమౌళి ఆలోచనలతో చంద్రబాబు ఆలోచనలు నిజంగానే మ్యాచ్‌ అవుతాయా.? అమరావతిపై రాజమౌళి వేసే ముద్ర ఎలా వుండబోతోంది.? గతంలో మాకీ సంస్థ, ఇప్పుడు నార్మన్‌ ఫోస్టర్స్‌ సంస్థ.. ఈసారన్నా అమరావతి డిజైన్లు ఖరారవుతాయా.? మాకీపై బురద జల్లిన చంద్రబాబు సర్కార్‌, నార్మన్‌ ఫోస్టర్స్‌ని ఊరకనే వదిలేస్తుందా.? ఈ మొత్తం ఎపిసోడ్‌లో రాజమౌళికి తగిన గౌరవం దక్కుతుందా.? ఆయనా అభాసుపాలవుతారా.? వేచి చూడాల్సిందే.