రాష్ట్రపతిగా దిగిపోయాక పొలిటికల్ గైడెన్స్

ప్రపంచంలోనే అతి పెద్దదైన ప్రజాస్వామిక దేశంలో రాజ్యాంగబద్ధమైన అత్యున్నత పదవిని అధిష్టించిన తరువాత.. దేశానికి ప్రథమ పౌరుడిగా సేవలు అందించిన తరువాత సాధారణంగా ఎవ్వరూ ఇక రాజకీయ ఆలోచనల, ప్రస్తావనల జోలికి వెళ్ళరు. కానీ ప్రణబ్ దాదా తీరు ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది. ఆయన మళ్ళీ రాజకీయాల్లోకి రాకపోవచ్చు.

కానీ, తన అపారమైన అనుభవాన్ని రంగరించి కాంగ్రెస్ పార్టీకి మార్గదర్శనం చేస్తుండాలనే కోరిక ఆయనకు బలంగా ఉన్నట్లుంది. ఆత్మకథ సిరీస్ పుస్తకాల రూపంలో ఆయన వెళ్ల్లడిస్తున్న అభిప్రాయాలు మాత్రం ఇదే అనుమానం కలిగిస్తున్నాయి.

పొత్తులు పెట్టుకోవడం కాంగ్రెస్ పార్టీ అస్తిత్వానికి ఏ రకంగా ప్రమాదకరమో ప్రణబ్ 2003లోనే హెచ్చరించారుట. ఆయన హెచ్చరికే నిజం అన్నట్లుగా ఇప్పుడు ఆ పార్టీ మిత్రపక్షాలు ఉన్న అనేకచోట్ల సోదిలో లేకుండా పోయింది. ఇప్పుడు 2019ఎన్నికల కసరత్తులో భాగంగా మళ్ళీ భాజపా వ్యతిరేక పార్టీలు అన్నిటినీ కలుపుకోవాలి అని చూస్తున్న కాంగ్రెస్ కు ప్రణబ్ మాటలు ఒక హెచ్చరిక లాగా ధ్వనిస్తున్నాయి.

కేవలం అధికారం దక్కించుకోవడానికే అయితే పొత్తులు పెట్టుకుని తమ మనుగడను ప్రమాదంలో పెట్టుకోవడం కన్నా, ప్రతిపక్షంలో కూర్చోవడం మేలని ప్రణబ్ అప్పట్లో సలహా ఇచ్చారట. కానీ మేడం పట్టించుకోలేదు. పర్యవసనాల్ని వారు ఇప్పుడు చూస్తూనే ఉన్నారు. యూపీయే లో ప్రతి చిన్న ప్రాంతీయ పార్టీ కూడా కాంగ్రెస్ మీద పెత్తనం చేసేవాళ్లే.

వారి వారి రాష్ట్రాల్లో సీట్ల సర్దుబాటు అంటే కాంగ్రెస్ కు ముష్టి వేసినట్లుగా విదిలిస్తున్న వాళ్లే. ఇలా అన్నీరకలుగాను పరువును పట్టును రెండూ కోల్పోయి కాంగ్రెస్ కుదేలవుతోంది. మరి ప్రణబ్ దాదా అనుభవంతో చెబుతున్న సలహాల్ని ఇప్పుడైనా ఆచరణలో పెట్టి పార్టీని కాపాడుకుంటారో.. అధికారానికై అర్రులు చాస్తారో వేచి చూడాలి.