రేవంత్‌కు పదవి సెంటిమెంటా?

రాజకీయ నాయకులకు, సినిమావాళ్లకు సెంటిమెంట్లు ఎక్కువ. సెంటిమెంటు కాదనుకొని ఏదైనా చేస్తే తప్పు చేశామనే భావన కలుగుతుంది. టీడీపీ నుంచి కాంగ్రెసులోకి ఫిరాయించిన తెలంగాణ నాయకుడు రేవంత్‌ రెడ్డికి కూడా సెంటిమెంట్లు ఉండొచ్చు. ప్రస్తుతం ఆయన వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే అది సెంటిమెంటేమోననిపిస్తోంది. ఇతర కారణాలు ఉన్నాయేమో తెలియదు.

ఈ నాయకుడికి కాంగ్రెసు పార్టీ కొత్తగా ఉండొచ్చుగాని ఆ పార్టీ నాయకులు కాదు. ఆయన బంధువులు, మిత్రులు అనేకమంది ఉన్నారు. పార్టీ ఫిరాయింపుకు వారి ప్రోద్బలం చాలావుంది. ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి చేరిన ఏ నాయకుడైనా ముందుగా చేసే పని కొత్త పార్టీ ప్రధాన కార్యాలయానికి వెళ్లడం. కార్యస్థానం అదే కాబట్టి వెళ్లకతప్పదు.

అయితే రేవంత్‌ రెడ్డి కాంగ్రెసులో చేరి చాలా రోజులైనా ఇప్పటివరకు కాంగ్రెసు పార్టీ ప్రధాన కార్యాలయమైన గాంధీ భవన్‌కు వెళ్లలేదు. నాయకుల ఇళ్లకు వెళ్లి వారిని మచ్చిక చేసుకుంటున్నారు తప్ప ఆ భవన్‌ మెట్లు ఎక్కలేదు. ఎందుకు ఎక్కలేదనే ప్రశ్నకు కొందరు ఓ కారణం చెబుతుండగా, కొందరు మరోటి చెబుతున్నారు. టీడీపీలో స్వేచ్ఛను అనుభవించిన రేవంత్‌ రెడ్డికి కాంగ్రెసులో ఊపిరి ఆడటంలేదని కొందరు చెబుతున్నదాంట్లో ఎంత నిజముందో తెలియదుగాని కొంత ఇబ్బందిగా మాత్రం ఫీలవుతున్నారు. చేరగానే పదవి ఇస్తారని, ఆ బాధ్యతతో దూసుకుపోవచ్చని, తన సత్తా చూపించవచ్చని అనుకున్నారు. కాని ఇప్పటివరకు అధిష్టానం ఏమీ మాట్లాడటంలేదు.

రాహుల్‌ గాంధీని అధ్యక్షుడిని చేసే ప్రక్రియలో అధిష్టానం తీరికలేకుండా ఉంది. డిసెంబరు ఐదో తేదీన ఆ ఎన్నిక ముగిసి (ఇదో నామమాత్రపు ప్రజాస్వామ్య ప్రక్రియ) విజయోత్సవాలు చేసుకున్న తరువాత ఆయన తెలంగాణకు వస్తారు. ఆ సందర్భంగా ‘గిరిజన గర్జన’ పేరుతో నిర్వహించే సభలో రేవంత్‌కు పదవి ఇస్తారని అనుకుంటున్నారు. పదవి ఇవ్వనంతవరకు ఆయన చేరికకు సార్థకత లేదు.

పదవి చేతిలో పెట్టుకొని, ఓ పెద్ద నాయకుడిగా గాంధీభవన్లో అడుగుపెట్టాలని కోరుకుంటున్నారు. కార్యకర్తగా వెళితే ఎవరు పట్టించుకుంటారు? ఎక్కడ కూర్చోవాలో కూడా తెలియదు. పదవి ఉన్న నేతగా వెళితే గౌరవిస్తారు. పెద్ద పదవి ఇస్తే ఈయనకంటూ ప్రత్యేక ఛాంబర్‌, సౌకర్యాలు ఉంటాయి. రాయల్‌గా వెళ్లడానికి ఇంకా సమయం పడుతుంది.

టీడీపీలో రేవంత్‌కు ఎంత వ్యక్తిగత ఇమేజ్‌ ఉందో తెలిసిందే. ఏ విషయంలోనైనా దూసుకుపోయేవాడు. అనుకున్నది చేసేవాడు. కాని కాంగ్రెసులో అలా చేయడానికి అవకాశంలేదు. పాదయాత్ర చేసి అధిష్టానం దృష్టిలో మంచి మార్కులు కొట్టేయాలనుకున్నాడు. కాని జరిగేలా కనబడటంలేదు. ప్రస్తుతం రేవంత్‌పై టీడీపీ నాయకులు కూడా విమర్శలు చేయడంలేదు. కొన్ని రోజులు పార్టీ అధ్యక్షుడు రమణ విమర్శలు చేయడం, దానికి ఈయన ప్రతివిమర్శలు చేయడం జరిగింది. ఈ నాయకుడు ఇప్పటికీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడినే తన గురువుగా భావిస్తున్నారని కొందరు కాంగ్రెసు నాయకులు చెబుతున్నారు.

రేవంత్‌ ఆయనతో ‘టచ్‌’లోనే ఉన్నారని, ఇద్దరి మధ్య అవగాహన ఉందని, బాబు ఈయనకు సలహాలు ఇస్తున్నారని అంటున్నారు. ఒక వ్యూహతోనే ఈయన తన రాజీనామా లేఖను (ఎమ్మెల్యే పదవికి) చంద్రబాబుకు ఇచ్చారని చెబుతున్నారు. ఇక కాంగ్రెసులోని ఈయన సామాజిక వర్గానికి చెందిన దిగ్గజ నాయకులు ఈయనకు ఎంతవరకు సహకారం అందిస్తారో తెలియదు. రేవంత్‌ ఎదుగుదలను అడ్డుకోవాలనుకునేవారిలో ఆ సామాజికవర్గంవారే ఉన్నారని కొందరు నాయకులు చెబుతున్నారు. ఈ నాయకుడు టీడీపీలో సీనియర్‌ కావొచ్చేమోగాని కాంగ్రెసులో జూనియరే కదా. తమను అధిగమించాలని ప్రయత్నిస్తే సీనియర్లు ఊరుకుంటారా?