రేవంత్‌ను బతిమాలాల్సిందే.. బెదిరించలేరు !

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి వెళుతున్న వ్యవహారం ఇవాళ రాజకీయ వర్గాల్లో సంచలనంగా చెలామణీ అవుతున్నది గనుక.. కొందరికి కొత్త అంశంలాగా కనిపిస్తుండవచ్చు. కానీ.. తెలుగుదేశంలోని కొందరు సీనియర్ నాయకుల ద్వారా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి… రేవంత్ కాంగ్రెస్ లోకి పోదలచుకున్న సంగతి పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు ఎప్పుడో తెలుసునట.

రేవంత్ ముందుగా ఆయనకే ఈ విషయం చెప్పారుట కూడా. ఆ ఫ్రస్ట్రేషన్ లోనే.. కేశవ్ వల్ల.. తెలంగాణ నాయకులు రాజీనామా చేసేస్తాం అంటున్నారంటూ ఆ నడుమ చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేయడం కూడా జరిగిందిట. కాకపోతే.. రేవంత్ ను ఏవిధంగానూ కట్టడి చేయలేని స్థితిలో చంద్రబాబునాయుడు అడ్డు చెప్పకుండా మిన్నకుండిపోయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

అంతకంటె లోతుగా వినిపిస్తున్న విశ్లేషణల ప్రకారం.. చంద్రబాబునాయుడు రేవంత్ రెడ్డిని హెచ్చరించే లేదా ఆదేశించే స్థితిలో లేరని, రేవంత్ ను బతిమాలే స్థితిలో మాత్రమే ఉన్నారని కూడా.. పలువురు పార్టీ వారే వ్యాఖ్యానిస్తున్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్ అయిన తర్వాత.. ఇప్పుడు రేవంత్ పార్టీ మారి.. ఆ ఎపిసోడ్ మొత్తం అధినేత చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకే జరిగిందని ఒక్క మాట చెబితే చాలు.. లీగల్ గా ఎప్పటికి ఏది తేలుతుందనే సంగతి తరువాత… ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు పరువు మాత్రం జాతీయ స్థాయిలో మంటగలిసిపోవడం గ్యారంటీ అని పలువురు అంటున్నారు. అందుకే రేవంత్ కు గట్టిగా క్లాస్ పీకలేక, పార్టీని వీడిపోతున్నప్పటికీ.. నియంత్రించలేక, అధినేత సతమతం అవుతున్నట్లు తెలుస్తోంది.

ఓటుకు నోటు కేసులో పీకల్దాకా కూరుకు పోయి ఉన్న నేపథ్యంలోనే చంద్రబాబునాయుడు, కేసీఆర్ ను పల్లెత్తు మాట అనలేని స్థితిలో తెలంగాణ తెలుగుదేశం పార్టీని మొత్తం బలిచేసేశారనే వ్యాఖ్యలు పార్టీలో చాలా తరచుగా వినిపిస్తుంటాయి. రేవంత్ రెడ్డికి ఈ వైఖరి కిట్టకే.. తన దారి తాను చూసుకుంటున్నారని, గతిలేని వాళ్లు మాత్రమే తెలంగాణ తెలుగుదేశం లో మిగిలే పరిస్థితి ఏర్పడిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. పైగా ఓటుకు నోటు ఎపిసోడ్ పై చంద్రబాబుకు ఇబ్బంది కలిగేలాగా.. రేవంత్ రెడ్డి భవిష్యత్తులోనూ పెదవి విప్పకుండా.. ఆయనను బతిమాలే పరిస్థితి ఉన్నదని కూడా అంటున్నారు.