రేవంత్‌ రగడ: చంద్రబాబు మార్క్‌ రాజకీయం

టీడీపీ అధినేత చంద్రబాబు విదేశాలకు వెళ్ళముందే తెలుగుదేశం పార్టీలో (తెలంగాణ శాఖ) ‘రేవంత్‌రెడ్డి రగడ’ షురూ అయ్యింది. ఆయన అలా విదేశాలకు బయల్దేరడం.. అదే సమయంలో ఢిల్లీలో రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ పెద్దల్ని కలిశారంటూ గాసిప్స్‌ రావడం.. అదీ టీడీపీకి అత్యంత అనుకూల మీడియా ఆ వ్యవహారాన్ని ‘బ్రేక్‌’ చేయడం తెల్సిన విషయమే.

అప్పటినుంచి, ఇప్పటిదాకా ఈ వ్యవహారం అలా అలా సాగుతూనే వుంది. చంద్రబాబు విదేశాల నుంచి తిరిగొచ్చారు. ఈలోగా రేవంత్‌రెడ్డి తెలంగాణ టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవికీ, టీడీఎల్పీ నేత పదవికీ తాత్కాలికంగా దూరమవ్వాల్సి వచ్చిందనుకోండి.. అది వేరే విషయం. చంద్రబాబుతో తెలంగాణ టీడీపీ నేతలు భేటీ అయ్యారు.. రేవంత్‌రెడ్డితో సహా.! ఆయా నేతల వాదనల్ని చంద్రబాబు విన్నారట. కానీ, చివరికి ఏమీ తేల్చకపోవడం గమనార్హం.

రేప్పొద్దున్న తెలంగాణ టీడీపీ ముఖ్య నేతలంతా విజయవాడకు వచ్చేయాలంటూ చంద్రబాబు ఆదేశించారు. దాంతో ‘జడ్జిమెంట్‌ డే’ కాస్తా, రేపటికి మారింది. రేపటి సమావేశంలోనే రేవంత్‌రెడ్డి వ్యవహారంపై ఓ స్పష్టత రానుంది. తెలంగాణ టీడీపీలో రేవంత్‌రెడ్డి ఒక్కరూ ఒకవైపు, మిగతావారంతా ఇంకో వైపు అన్నట్టుగా వుంది. ఆ మిగతావారంతా తెలంగాణలో టీడీపీ – టీఆర్‌ఎస్‌ మధ్య పొత్తు కోసం ఆరాటపడ్తున్నారు. రేవంత్‌రెడ్డి మాత్రం, అధికార పార్టీతో పొత్తు ఏంటి.? అవసరమైతే ప్రతిపక్షం కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలని అంటున్నారు. ఇదీ అసలు రచ్చ.

మొత్తమ్మీద, చంద్రబాబు మార్క్‌ రాజకీయమైతే నడుస్తోందిప్పుడు. విదేశాల నుంచే ఆయన ఈ రాజకీయాన్ని అలా అలా నడిపిస్తున్నారు. రేపటితో ఈ రాజకీయానికి ఓ ట్విస్ట్‌ లభిస్తుందా.? వివాదానికి ఇక్కడితో శుభం కార్డు పడ్తుందా.? ఏమోగానీ, రేవంత్‌ని టీడీపీ నుంచి బయటకు పంపేదాకా ‘ఓ మీడియా సంస్థ’ (ఇది టీడీపీకి అధికార గెజిట్‌గా పనిచేస్తోంది) ఊరుకునేలా కన్పించడంలేదు.