లక్షలు ఇచ్చేశాం… ఇవ్వడం సాధ్యంకాదు…!

ఇవ్వడం సాధ్యం కానిదేది? లక్షలు ఇచ్చిందేమిటి? ఇదేమైనా డబ్బుల వ్యవహారమా? కాదు…ఇది తెలగు రాష్ట్రాల్లో ఉద్యోగాల ప్రహసనం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆంధ్రా సీఎం చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెబుతూ ప్రజలను, యువతను మభ్యపెట్టడంలో దిట్టలు. ప్రత్యేక తెలంగాణ రాగానే లక్ష ఉద్యోగాలు ఇస్తామని కేసీఆర్‌ ప్రచారం చేయగా, బాబుదీ డిటోయే.

టీడీపీ తమ్ముళ్లు ‘బాబు వస్తే జాబు వస్తుంది’ ఊదరగొట్టారు. చివరకు రెండు రాష్ట్రాల్లోనూ యువతకు, నిరుద్యోగులకు నిరాశే మిగిలింది. రాష్ట్రం విడిపోవడంతో ఇద్దరు చంద్రులూ బాగుపడ్డారుగాని నిరుద్యోగుల జీవితాల్లో మార్పు రాలేదు. కేసీఆర్‌, చంద్రబాబు ఉద్యోగాలిస్తామని ప్రచారం చేసుకున్నది ప్రభుత్వ ఉద్యోగాల గురించే. ప్రయివేటు ఉద్యోగాలు వీరు ఇచ్చేదేముంది?

ఏపీలో ప్రభుత్వంలో ఉద్యోగాలు లేవు. ఉన్నోళ్ల రిటైర్మెంటు వయసును అరవై ఏళ్లకు పెంచారు. నోటిఫికేషన్లు ఇస్తున్నామని చెప్పడం తప్ప వాస్తవంలో ఉద్యోగాలు కనబడటంలేదు. కాని చంద్రబాబు, కుమారుడు కమ్‌ మంత్రి లోకేష్‌ లక్షల ఉద్యోగాలు ఇచ్చామని ప్రచారం చేస్తున్నారు. దీనిపై జనం నిలదీస్తున్నా పట్టించుకోకుండా అదే పనిగా ‘లక్షల’ జపం చేస్తున్నారు. గత మూడేళ్లలో రాష్ట్రానికి లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని, దీంతో 3.61 లక్షల ఉద్యోగాలు కల్పించామని ఎంపీ రామ్మోహన్‌ నాయుడు కొద్దిరోజుల కిందట ఓ ప్రకటన విడుదల చేశాడు. ఒక్క ప్రభుత్వ రంగంలోనే 30 వేల ఉద్యోగాలు ఇచ్చారట…!

ఈ ప్రకటన చేసి ఎక్కువకాలం కాకముందే రాష్ట్రంలో 5 లక్షల ఉద్యోగాలిచ్చామని, రెండు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తాజాగా ఆయనే ప్రకటన ఇచ్చారు. కొంతకాలం క్రితం లోకేష్‌ ఓ సందర్భంలో మాట్లాడుతూ 2020నాటికి 5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. మరి రామ్మోహన్‌ నాయుడు ఇప్పటికే ఐదు లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్లు ఎందుకు చెప్పారు? ఎవరి ఇష్టం వారిదన్నమాట. లోకేష్‌ ఆమధ్య విశాఖ పర్యటన సందర్భంగా మాట్లాడుతూ 2019 నాటికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు. ఐటీలో లక్ష ఉద్యోగాలు, ఎలక్ట్రానిక్‌ రంగంలో లక్ష ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు.

ఇదే లోకేష్‌ మరో సందర్భంలో హైదరాబాదులో ఉన్నన్ని సౌకర్యాలు విశాఖలో లేవు కాబట్టి పరిశ్రమలు ఎక్కువగా వచ్చేందుకు అవకాశం లేదన్నారు. ఏపీకి ఆర్థిక రాజధాని అని చెప్పుకుంటున్న విశాఖలోనే పరిశ్రమలు, కంపెనీలు రాకపోతే మిగతా నగరాలకు ఏం వస్తాయి? చంద్రబాబు ఏపీ అభివృద్ధిలో దూసుకుపోతోందంటారు. కొన్నాళ్లు అభివృద్ధి పనులకు డబ్బు లేదని, కేంద్రం నుంచి ఆశించినరీతిలో సాయం అందటంలేదని దీనంగా మాట్లాడతారు ఓసారి కర్నూలుకు వెళ్లినప్పుడు తమ ప్రభుత్వం వచ్చాక భారీగా పరిశ్రమలు ఏర్పాటయ్యాయని, కియా మోటార్స్‌ రాకతో ఐదు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని లోకేష్‌ చెప్పడంతో ఆగ్రహించిన జనం ఒక్క ఉద్యోగమైనా ఇచ్చినట్లు నిరూపించాలని నిలదీయడంతో బిత్తరపోయారు. ఒక పరిశ్రమ ద్వారా ఐదు లక్షల ఇవ్వడం సాధ్యమేనా?

ఏపీలో కథ ఇలా నడుస్తుండగా, ‘అందరికీ, అన్ని రంగాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం ఎవ్వరికీ సాధ్యం కాదు’…ఇదీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీలో చెప్పిన ‘అసలు’ విషయం. శుక్రవారం నిరసనలు, గందరగోళం మధ్య ప్రారంభమైన అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగాల గురించి ఉన్న విషయం చెప్పి బరువు దించుకున్నారు. నిజానికి ఈయన వాస్తవం చెప్పినట్లు కనబడుతున్నా గతంలో నిరుద్యోగుల్లో ఆశలు కల్పించిన తీరుకు, ఇప్పుడు చెప్పినదానికి పొంతన లేదు. తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసం. నియామకాలంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆంధ్రావారి ఆధిపత్యాన్ని బద్దలు కొట్టి తెలంగాణవారికి ఉద్యోగాలు ఇవ్వడం.

రాష్ట్రం ఏర్పడితే లక్ష ఉద్యోగాలిస్తానని కేసీఆర్‌ ఆనాడు చెప్పారు. దీంతో ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు, అనేక ప్రభుత్వ, ప్రయివేటు సంస్థల్లో చదువుకుంటున్న యువతీయువకులు ఆశలు పెంచుకున్నారు. కాని కేసీఆర్‌ వారి ఆశలను తుంచేశారు. అందుకే ఆయన ఉస్మానియా యూనివర్శిటీకి పోలేని పరిస్థితి, పోయినా మాట్లాడలేని దురవస్థ దాపురించాయి. ఉన్న పది జిల్లాలను 31 జిల్లాలుగా విభజించాక వాటిల్లో కొత్తగా ఉద్యోగులను నియమించలేక ఉన్నవారినే అడ్జెస్టు చేశారు. ప్రతిపక్షాలు, ముఖ్యంగా ఉద్యమంలో ప్రొఫెసర్‌ కోదండరామ్‌ ఉద్యోగాల గురించి పోరాటాలు చేస్తున్నారు. అయినప్పటికీ పాలకులు ‘బంగారు తెలంగాణ’ అనే జపం చేస్తూ యువతను మభ్యపెడుతూనే ఉన్నారు.