రేవంత్‌ వర్సెస్‌ రమణ: ఎవరి సంగతేంటి.?

అసలు తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో చోటే లేని ప్రస్తుత పరిస్థితుల్లో తన ఉనికిని చాటుకునేందుకు, పార్టీ ఐకమత్యంగా వుండాల్సింది పోయి.. మిగిలిన ఆ పది మంది నాయకుల మధ్యా ‘లొల్లి’ షురూ అవడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్‌.రమణ, పార్టీ తెలంగాణ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి మధ్య చర్చ తారాస్థాయికి చేరింది.

మోత్కుపల్లి నర్సింహులు, అరవింద్‌కుమార్‌గౌడ్‌ అండ చూసుకుని మోత్కుపల్లి రెచ్చిపోతోంటే, కాంగ్రెస్‌ అండ చూసుకుని రేవంత్‌రెడ్డి తానేం తక్కువ కాదంటూ హడావిడి చేసేస్తున్నారు. రేపు రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఓ టీడీఎల్పీ సమావేశం జరగనుండగా, ఎల్‌.రమణ ఆధ్వర్యంలో మరో టీడీఎల్పీ సమావేశం జరగనుంది.

ఆగండాగండీ, ఇంతకీ టీడీపీకి తెలంగాణలో ఎంతమంది ఎమ్మెల్యేలు మిగిలారో తెలుసా.? జస్ట్‌ ముగ్గురే. అందులో ఒకరు ఆర్‌.కృష్ణయ్య.. అసలు టీడీపీలోనే వున్నారా.? లేదా.? అన్నదీ డౌటే. మరి, మిగిలిన ఇద్దరిలో ఒకరు రేవంత్‌రెడ్డి. ఆయనే, టీడీఎల్పీ చీఫ్‌. ఇంకొకాయన సండ్ర వెంకట వీరయ్య. చిత్రంగా ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ఓటుకు నోటు కేసులో మొదటి, రెండో నిందితులు కావడం గమనార్హం.

శాసనసభకు సంబంధించిన విషయాల్లో ఎల్‌.రమణ పెత్తనమేంటన్నది రేవంత్‌రెడ్డి ప్రశ్న. తెలంగాణ టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, టీడీఎల్పీ చీఫ్‌ అనే పదవులతో కాకుండా, మామూలుగా ఓ ఎమ్మెల్యే హోదాలో టీడీఎల్పీ సమావేశానికి హాజరయితే ఫర్లేదన్నది ఎల్‌.రమణ ఉవాచ. కామెడీగా వుంది కదూ.! టీడీపీ పొత్తులపై క్లారిటీ ఇచ్చాక తాను టీడీపీలో వుండాలా.? లేదా.? అన్నది నిర్ణయించుకుంటానంటూ మధ్యలో ఆర్‌.కృష్ణయ్య వ్యాఖ్యానిస్తుండడం ఇంకా పెద్ద కామెడీ.

ఏమాటకామాటే చెప్పుకోవాలంటే, గడచిన మూడున్నరేళ్ళలో టీడీపీ తరఫున గట్టిగా నిలబడి, టీఆర్‌ఎస్‌ని ధీటుగా ఎదుర్కొంటోన్నది రేవంత్‌రెడ్డి మాత్రమే. అయితే, రేవంత్‌రెడ్డి అతి ఆవేశం ఆయన కొంప ముంచేసింది. ఎల్‌.రమణ పేరుకే టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు. ఆయన గట్టిగా రాజకీయ ప్రత్యర్థులపై మాట్లాడిందే లేదు. కానీ, ఇప్పుడు మాత్రం ఆయన ‘అధ్యక్ష’ దర్పం చూపిస్తుండడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.

చంద్రబాబు విదేశాల నుంచి వస్తే తప్ప రేవంత్‌ ఎపిసోడ్‌కి ‘తెర’ పడే అవకాశం లేదు. ఈలోగా తెలంగాణ టీడీపీలో లొల్లి.. అదీ పార్టీ ఉనికి ప్రశ్నార్థకమైన పరిస్థితుల్లో. ఇంతకన్నా కామెడీ ఇంకేమన్నా వుంటుందా.?