రేవంత్ చంద్రబాబును ఇరుకున పెట్టాడా?

నెమ్మదిగా రేవంత్ రెడ్డి రాజీనామా వ్యవహారానికి సంబధించి కొన్ని అనుమానాలు ముసురుకుంటున్నాయి. రేవంత్ రెడ్డి మాత్రం తాను అచ్చంగా స్పీకర్ ఫార్మాట్ లోనే రాజీనామా చేసేశా అన్నట్లుగా లేఖ ప్రతిని కూడా మీడియాకు విడుదల చేసేశారు. అంతవరకు ఎవ్వరికీ సందేహం లేదు. మరోవైపు రాజీనామా లేఖ ఆమోదం మాత్రం పొందలేదు. ఇందులో మర్మం చెబుతూ… అసలు రేవంత్ రాజీనామా లేఖ స్పీకరు మధుసూదనాచారికి అందనే లేదని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ లాంటివాళ్లు అంటున్నారు.

స్పీకరు ఆస్పత్రినుంచి తిరిగి విధులకు కూడా వచ్చేస్తున్నారు. ఇప్పటిదాకా రేవంత్ రాజీనామా గురించిన ప్రస్తావన రావడం లేదు. రేవంత్ మాత్రం.. కాంగ్రెసులో చేరిన తర్వాత శాసనసభకు రావడం లేదు. ఇన్ని రకాల భిన్న సంక్లిష్టతల మధ్య అసలు రేవంత్ రాజీనామా ఏమైంది? అనే సందేహం సహజంగానే రేకెత్తుతోంది. రేవంత్ తన రాజీనామాతో , చంద్రబాబునాయుడును ఇరుకున పెట్టారేమో అనే అనుమానాలు కలుగుతున్నాయి.

రేవంత్ రెడ్డి తాను పార్టీకి రాజీనామా చేసిన రోజునే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. ఆ లేఖను కూడా ఆయన అమరావతిలోనే విడుదల చేశారు. అంటే.. పార్టీ రాజీనామా లేఖతో పాటూ.. ఎమ్మెల్యే రాజీనామా లేఖను కూడా ఆయన చంద్రబాబునాయుడుకే ఇచ్చారని అనుకోవాలి. చంద్రబాబునాయుడు పార్టీ ద్వారా వచ్చిన టిక్కెట్ తో గెలిచాడు గనుక.. ఆ పదవికి రాజీనామా లేఖను ఆయన చేతికే ఇవ్వడం సబబు అని రేవంత్ భావించి ఉండవచ్చు. ఆ రకంగా ఆయన తన పనిని సమర్థించుకోవచ్చు. (గతంలో శిల్పా చక్రపాణి రెడ్డి , తన రాజీనామా లేఖను జగన్ చేతికి సభాముఖంగా ఇస్తే. జగన్ దానిని మండలి ఛైర్మన్ కు పంపించారు).

అదే జరిగిఉంటే గనుక… చంద్రబాబు ఇరుకున పడ్డట్టే. రేవంత్ రాజీనామా లేఖను ఆయన స్పీకరుకు పంపితే వెంటనే రేవంత్ పదవి పోతుంది. అయితే ఇతర పార్టీల నుంచి బోలెడంత మందిని తన పార్టీలోకి ఫిరాయింపజేసుకున్న చంద్రబాబు.. వారితో రాజీనామాలు చేయించలేకపోయారు గానీ.. తన పార్టీనుంచి ఒక్కరు వెళితే.. వెంటనే వారి పదవి ఊడగొట్టారని అపప్రధ దక్కుతుంది. రేవంత్ రాజీనామాను ఆమోదానికి పంపేముందు, తన పార్టీలోకి వచ్చిన మిగిలిన వారితో కూడా రాజీనామా చేయించడం కనీస ధర్మం అనే విమర్శలు వస్తాయి.

వాటిని ఎదుర్కొనలేక చంద్రబాబు రేవంత్ రాజీనామాను పట్టించుకోకుండా, సుప్త చేతనావస్థలో ఉంచేసినట్లుగా కనిపిస్తోంది. దాన్ని తన వద్ద నుంచి స్పీకరుకు పంపితే ఒక తంటా… పంపకపోతే.. రేవంత్ పదవి పోకుండా చంద్రబాబు కాపాడుతున్నాడు… అనే విమర్శలు ఇలా ఏం చేసినా.. ఏదో ఒక మాట పడాల్సి వచ్చేలా ఉంది. అందుకే రేవంత్ రెడ్డి తన రాజీనామా లేఖను డైరక్టుగా స్పీకరుకు ఇవ్వకుండా పార్టీ అధినేతకు ఇచ్చి ఆయనను ఇరుకున పెట్టారనే వాదన రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.