రేవంత్ రాజీనామా: ఆమోదం, ఉపఎన్నిక డౌటేనా?

రోజులు గడుస్తున్న కొద్దీ రేవంత్ రెడ్డి రాజీనామా ఎపిసోడ్ పై రాజకీయ వర్గాల్లో అనేక అనుమానాలు కమ్ముకుంటున్నాయి. అసలు ఇంతకూ రాజీనామా ఆమోదం పొందుతుందా? లేదా? అనే సంశయాలు మొదలవుతున్నాయి. ఒకవేళ రాజీనామా ఆమోదం పొందినా సరే.. ఉప ఎన్నికలు రాకుండా.. భిన్నమైన పరిస్థితులు ఏర్పడవచ్చు అనే అభిప్రాయాలు కూడా పలువురికి కలుగుతున్నాయి. పైన చెప్పుకున్న అన్ని రకాల సందేహాలకు కూడా.. సరైన హేతుబద్ధత ఉందనే ఉంది.

ఒక్కొక్కటిగా పరిశీలిస్తే…

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నంద్యాల ఉప ఎన్నికకు ముందు ఎమ్మెల్సీ శిల్ప చక్రపాణిరెడ్డి తన పదవికి రాజీనామా చేస్తే.. ఒకే ఒక్కరోజులో అది ఆమోదం పొంది ఆయన పదవి పోయింది. ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి రాజీనామా చేసి రోజులు గడుస్తున్నాయి. ఇంకా ఆయన పదవి మాత్రం పోలేదు. ఈమాత్రం అలస్యాన్ని కూడా ఆయన ప్రత్యర్ధులు కొందరు సహించలేకపోతున్నారు. అయితే.. రేవంత్ రాజీనామా సాంకేతికంగా ఇప్పటిదాకా స్పీకర్ మధుసూదనాచారి దృష్టికి వెళ్లనే లేదు. ఆయన లేఖ స్పీకరు కార్యాలయానికి ఇంకా చేరనేలేదని కూడా వార్తలు వస్తున్నాయి.

స్పీకర్ ప్రస్తుతం అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన సభకు ఎప్పుడు వస్తారో తెలియదు. ఆయన వచ్చిన తరువాత గానీ నిర్ణయం జరగదు. ఆయన తిరిగి విధుల్లోకి వచ్చేలోగా శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ముగిసిపోతే గనుక… రాజీనామా సంగతి ఆయన దృష్టికి వెళ్ళడానికి ఇంకా ఆలస్యం కావచ్చు. ఆ రకమైన కారణాల వల్ల అది ఎప్పుడు ఆమోదం పొందుతుందో తెలియదు.

రాజీనామా ఆమోదం పొందిన తర్వాత ఆయన ఎన్నికల సంఘానికి లేఖ రాస్తే వారు సీట్ ఖాళీ అని నోటిఫై చేస్తారు. ఆ తరువాత 6 నెలల్లో ఎన్నికలు నిర్వహించాలనేది నిబంధన. ఈ తంతు మొత్తం ముగిసే సరికి కొన్నినెలలు గడుస్తాయి. ఒకవేళ 2018 చివర్లోనే మోదీ ప్లాన్ చేస్తున్న జమిలి ఎన్నికలు వస్తే గనుక.. ఎన్నికల కమిషన్ వాటిని దృష్టిలో ఉంచుకుని కేవలం కొన్నినెలల వ్యవధి కోసం ఉపఎన్నిక ఖర్చు ఎందుకు లెమ్మని ఊరుకోవచ్చు.

ఈ సమయంలో కొడంగల్ ఉపఎన్నికను ఎదుర్కొనే విషయంలో కేసీఆర్ కు ఏమైనా సంశయాలు ఉంటే గనుక.. ఉపఎన్నికలో ఫలితం తమకు అనుకూలంగా ఉండే అవకాశం లేదని ఆయన సర్వేలో తేలిస్తే గనుక… రాజీనామా ఆమోదం అనే పర్వం ఆలస్యం అయ్యేలా ఆయన పావులు కడపవచ్చు. ఇలాంటి అన్ని రకాల కాంబినేషన్ లను ఊహిస్తున్న వారు ఇలాంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.