ఏపీ వనరులపై కన్నేసిన తెలంగాణ

మారాష్ట్రం మాకిచ్చేయండి.. మా బతుకులు మేం బతుకుతాం… అని ఇన్నాళ్లూ నినదించారు. అదే ఎజెండాగా పోరాటాలు సాగించారు. విజయం సాధించారు. సొంత రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే.. ఇంకా ఏపీలో ఉన్న సహజవనరులు, ఏపీ రాష్ట్ర సంపదలో తమకు కూడా వాటా కావాలంటూ.. ఇప్పుడు వారు గొడవ చేస్తున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండుముక్కలు అయిన తర్వాత.. ఎవరి బతుకులు వారు బతుకుతున్న సమయంలో… ఏపీలో ఉన్న వనరులపై తమకు హక్కులు కావాలని, ఆ మేరకు కేంద్రం సూచనలు చేయాలని కోరుతూ.. తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించడం విస్తుగొలుపుతోంది. ప్రత్యేకించి నీటివనరుల విషయంలో ఏపీ ఏయే ప్రాజెక్టులను ప్రాణాధారాలుగా భావిస్తూ ఉంటుందో వాటి విషయంలో… ఇప్పుడు తెలంగాణ కన్నేసింది. తాము వాటా పొందాలని చూస్తున్నది.

పులిచింతల ప్రాజెక్టు దగ్గరినుంచి, గోదావరి నుంచి మళ్లిస్తున్న నీటిలో వాటా.. ఉత్పత్తి చేస్తున్న విద్యుత్తులో వాటా.. నాగార్జున సాగార్ మీద పూర్తిస్థాయిలో రెండు వైపులా శాంతిభద్రతల పర్యవేక్షణ అధికారం ఇవన్నీ తమకే కావాలంటూ తెలంగాణ ప్రభుత్వం కోరుతుండడం ఆశ్చర్యకరం. తెలంగాణ ప్రభుత్వ కోరికలు ఎలా ఉన్నాయంటే.. ఒక రాష్ట్రం మరొక రాష్ట్రంలో ఉన్న వనరుల గురించి అడిగినట్లుగా లేదని… ఒకే రాష్ట్రంలో అంతర్భాగంగా ఉంటూ, తమ ప్రాంతానికి రావాల్సిన వాటా గురించి అడిగినట్లుగా ఉన్నదని పలువురు నిపుణులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

పులిచింతలను ఉమ్మడి ప్రాజెక్టుగా పరిగణించాలని అడగడమే ఒక చిత్రమైన కోరిక. దానికి అదనంగా నాగార్జున సాగర్ డ్యాం రెండువైపులా శాంతి భద్రతలు కూడా తమ ప్రభుత్వం చూసేలా ఆదేశాలు ఇవ్వాలని వారు కోరుతున్నారు. ప్రస్తుతం డ్యాం నిర్వహణ తెలంగాణ చూస్తున్నది. శాంతి భద్రతలు ఏపీ చూస్తున్నది. ఏపీ పర్యవేక్షణ మీద అనుమానాలు ఉంటే వాటిని స్పష్టంగా వెలిబుచ్చి రెండు రాష్ట్రాలకు నిమిత్తం లేని కేంద్ర బలగాల్ని పెట్టాలని కోరడం సబబుగా ఉంటుంది.

అలాకాకుండా, డ్యాం నిర్వహణతో పాటూ శాంతి భద్రతలు కూడా వారి చేతికే వచ్చేస్తే.. ఇక వారే ఇష్టారాజ్యంగా చెలరేగుతారు కదా.. అనే అనుమానాలు పలువురిలో కలుగుతున్నాయి. దీనికి తోడు గోదావరి నుంచి మళ్లించే నీటిలో వాటా అడగడం చిత్రమైన వ్యవహారం. గోదావరి ప్రవాహానికి చిట్టచివర్న ఉన్న రాష్ట్రంగా మిగులునీటిని మాత్రమే ఏపీ ఉపయోగించుకుంటోంది తప్ప.. వాటాల్లో భాగంగా వచ్చేనీరు కాదు.

సముద్రంలో కలిసిపోయే నీటికి కట్టలు వేసి మళ్లించి వాడుకుంటోంది. ఆ నీటి మీద కూడా ఎలా హక్కులు కోరుకుంటూ.. వాటాలు అడుగుతున్నారో అర్థం కాని సంగతి. కేంద్రంతో తమ పార్టీ ఇప్పుడు సత్సంబంధాలు కొనసాగిస్తున్నది కదాని.. ఏపీ ప్రయోజనాలకు విఘాతం కలిగేలా ఏం అడిగినా ఒప్పుకుంటారని తెలంగాణ పాలకులు భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది.