లోకేష్‌ ‘అతి’: కంట్రోల్‌ చెయ్యలేని ‘డ్యామేజ్‌’

తెలుగుదేశం పార్టీకి నారా లోకేష్‌ చేసిన సేవలేంటి.? అని ఒక్కసారి ప్రశ్నించుకుంటే, తెలుగుదేశం పార్టీ నేతలకే అంతు చిక్కని వ్యవహారమది.. అన్పించకమానదు. కేవలం, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుగారి పుత్రరత్నం కాబట్టే, నారా లోకేష్‌, టీడీపీకి జాతీయ ప్రధాన కార్యదర్శి అవగలిగారు. ‘వారసత్వం’ కారణంగానే, నారా లోకేష్‌ ఎమ్మెల్సీగా ఎంపికవడం, మంత్రి పదవి చేపట్టడం తెల్సిన విషయాలే.

పోనీ, మంత్రి అయ్యాక అయినా నారా లోకేష్‌ కారణంగా టీడీపీకి ఏమన్నా లాభం చేకూరిందా.? ప్రభుత్వానికైనా నారా లోకేష్‌ కారణంగా మంచి పేరు వచ్చిందా.? అంటే అదీ లేదాయె.! లాభం చేకూరలేదు సరికదా, లోకేష్‌ వ్యాఖ్యలతో ప్రతిసారీ అటు టీడీపీ, ఇటు టీడీపీ ప్రభుత్వం.. రెండూ ఇరకాటంలో పడిపోతున్నాయి. లోకేష్‌ పొలిటికల్‌ డైలాగులు పేల్చే క్రమంలో ‘తడబాటు’ ప్రదర్శించడం, అవి కాస్తా సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌ అవడం తెల్సిన విషయాలే.

ఇక, ఇప్పుడు ‘నంది’ అవార్డుల విషయంలో లోకేష్‌ స్పందనతో ఒక్కసారిగా టీడీపీ ఉలిక్కి పడింది. నిన్న మొన్నటిదాకా పరిస్థితి వేరు. ‘నంది’ పురస్కారాలపై భిన్నాభిప్రాయాలు సహజమేనని కొందరు సరిపెట్టుకున్నారు. కొందరు గగ్గోలు పెట్టారు. కానీ, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సినీ పరిశ్రమలో ప్రతి ఒక్కరూ ఇప్పుడు నారా లోకేష్‌ వ్యాఖ్యలపై స్పందించాల్సిన ‘అవసరం’ ఏర్పడింది. ఆ అవసరాన్ని స్వయానా లోకేష్‌ కల్పించడం గమనార్హమిక్కడ.

ముందుగా టీడీపీ అనుకూల మీడియాలో ‘ఆధార్‌ కార్డు.. ఓటర్‌ కార్డు..’ అంశం బ్రేకింగ్‌ న్యూస్‌ల రూపంలో బయటకొచ్చింది. ఆ తర్వాత అవే వ్యాఖ్యలు నారా లోకేష్‌ నోట విన్పించాయి. అంతే, సినీ పరిశ్రమ షాక్‌కి గురయ్యింది. ‘అసలు ఆ వ్యాఖ్యలు లోకేష్‌ మతి వుండే చేశారా.?’ అన్న ఆశ్చర్యం సినీ పరిశ్రమలో వ్యక్తమవుతోంది. సినీ పరిశ్రమలో చాలావరకు ‘టీడీపీ అనుకూల’ పరిస్థితులు వుంటాయన్నది ఓపెన్‌ సీక్రెట్‌. కానీ, ఇప్పుడు ఆ ‘అనుకూల వర్గం’ కూడా లోకేష్‌ మాటల్ని సమర్థించలేని పరిస్థితి.

సినీ పరిశ్రమని ఉద్దేశించే లోకేష్‌ ఈ వ్యాఖ్యలు చేసినా, ఆ వ్యాఖ్యలు మొత్తంగా హైద్రాబాద్‌లో వుంటోన్న సీమాంధ్రులందరికీ షాక్‌ ఇచ్చాయి. సినీ పరిశ్రమతో కలుపుకుని, తెలంగాణలో వున్న సీమాంధ్రుల పరిస్థితే ఇలా వుంటే, ఎన్నారైల పరిస్థితి ఇంకెలా వుంటుందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి, తెలంగాణలో తెలుగు సినీ పరిశ్రమ మీదగానీ, సీమాంధ్రుల మీదగానీ గడచిన మూడున్నరేళ్ళలో ఎలాంటి ‘బేధభావం’ తెలంగాణ ప్రభుత్వం చూపించలేదు. కానీ, లోకేష్‌ ఎందుకు ఆ ‘డిఫరెన్స్‌’ తీసుకొచ్చారట.?

చాలా సీరియస్‌ అంశమిది. ఏదో పొలిటికల్‌గా ఓ పంచ్‌ డైలాగ్‌ పేల్చేద్దామని ‘చినబాబు’ తొందరపడితే, అదింత దారుణంగా తెలుగుదేశం పార్టీని దెబ్బ తీస్తుందనుకోలేదంటూ టీడీపీ నేతలు ఆఫ్‌ ది రికార్డ్‌గా గగ్గోలు పెట్టాల్సిన దుస్థితి దాపురించింది. వున్నపళంగా తన వ్యాఖ్యలకు నారా లోకేష్‌ ‘క్షమాపణ’ చెబితే సరేసరి.. లేదంటే.. టీడీపీకి ముందు ముందు జరగబోయే పొలిటికల్‌ డ్యామేజీ ఎవరూ ఊహించని రేంజ్‌లో వుంటుందని ఖచ్చితంగా చెప్పేయొచ్చు.