‘వరద’లో కొట్టుకుపోతున్న చిన్న సినిమాలు

‘చిన్న సినిమాల్ని బతకనివ్వండి..’ అంటూ చిన్న సినిమాల తరఫున వాకాల్తా పుచ్చుకుంటోన్న కొందరు సినీ ప్రముఖులు, పెద్ద సినిమాలపైనా, పెద్ద నిర్మాతలపైనా ఆరోపణలు చేస్తూ, సినీ పరిశ్రమలో అప్పుడప్పుడూ అలజడి సృష్టిస్తోన్న విషయం విదితమే. నిజమే, పెద్ద సినిమా విజయం సాధిస్తే వచ్చే కిక్కు కన్నా ఎక్కువ కిక్కు చిన్న సినిమా సాధిస్తే వస్తుంది. ఈ మధ్య చాలా చిన్న సినిమాలు అలాగే సంచలన విజయాల్ని సాధించి, పెద్ద నిర్మాతలూ చిన్న సినిమాలవైపు చూసేలా చేశాయి.

కానీ, చిన్న సినిమాల మధ్యనే సరైన కమ్యూనికేషన్‌ లేకపోతే ఎలా.? మొన్నీమధ్యనే ఓ శుక్రవారం చిన్న సినిమాలు వరదలా విడుదలయ్యాయి. అందులో కొన్ని ఫర్వాలేదన్పించుకున్నాయి కూడా. కానీ, ఏం లాభం.? ఒక్క సినిమా కూడా జనానికి గుర్తు లేకుండా పోయింది. కారణం.. సినిమాల ‘వరద’. తమిళ సినిమాలూ, స్ట్రెయిట్‌గా తెలుగులోనే వచ్చిన కొన్ని చిన్న సినిమాలూ.. కలిసి అటూ ఇటూగా 10 సినిమాలదాకా ఒకే రోజు విడుదలైతే పరిస్థితి ఎలా వుంటుంది.?

ఈ వారం కూడా దాదాపు అదే పరిస్థితి. కుప్పలు తెప్పలుగా సినిమాలు విడుదలవుతున్నాయి. వాటిల్లో కొన్నిటికి ప్రీ రిలీజ్‌ పాజిటివ్‌ టాక్‌ వున్న సినిమాలు, పబ్లిసిటీ పరంగా బాగా హల్‌చల్‌ చేస్తున్న సినిమాలూ వున్నాయి. మరి, ఇన్ని సినిమాల్లో ఏది నిలదొక్కుకుంటుంది.? చెప్పడం కష్టమే. కనీసం రెండు మూడైనా వసూళ్ళ పరంగా ఫర్వాలేదన్పించుకుంటాయా.? అన్నదీ అనుమానమే.

చిన్న సినిమాలకు పెద్ద సినిమాలు అవకాశమే ఇవ్వట్లేదనీ, థియేటర్లు దొరకనీయకుండా కొందరు చేస్తున్నారనే ఆరోపణ తెల్సిందే. మరి, చిన్న సినిమాలూ తమలో తాము పోటీ పడితే, ఎవరికి లాభం.? అదీ ‘వరదలా’ చిన్న సినిమాలు వెల్లువెత్తడమంటే.. చిన్న సినిమానే చిన్న సినిమాని చంపేసినట్లు కాదా.? పెద్ద సినిమాలే నయ్యం.. ఒకేసారి విడుదలయ్యే పరిస్థితి వస్తే.. కనీసం ఒక రోజు, రెండ్రోజుల గ్యాప్ తీసుకుంటున్నాయి. ఆ మాత్రం కమ్యూనికేషన్ చిన్న సినిమాల మధ్య లేకపోవడం ఆశ్చర్యకరమే.